ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో నేజా మేళా అనే జాతర జరుపుకోడానికి అనుమతి ఇవ్వడినికి జిల్లా అధికార గణం నిరాకరించింది. ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతోనూ, భద్రతా కారణాల వల్లనూ నేజా మేళాకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
నేజా మేళా కమిటీ సభ్యులు మార్చి 17న సంభాల్ ఏఎస్‌పీ శిరీష్ చంద్రతో భేటీ అయ్యారు. ఆ సమావేశం సందర్భంగా అసలు నేజా మేళా దేనికోసం చేస్తారని ప్రశ్నించారు. ‘సయ్యద్ సలార్ మసూద్ గాజీ’ గౌరవార్థం మేళా నిర్వహిస్తారని కమిటీ సభ్యులు చెప్పారు. సయ్యద్ గాజీ భారతదేశం మీద దురాక్రమణలు చేసిన మహమ్మద్ గజనీ దగ్గర కమాండర్‌గా ఉండేవాడు. ఆ విషయం తెలిసిన వెంటనే, మేళాకు అనుమతి ఇవ్వడం కుదరదని ఏఎస్‌పీ శిరీష్ చంద్ర చెప్పేసారు.
నేజా మేళా ప్రతీ యేటా మార్చి 25 నుంచి 27 వరకూ నిర్వహిస్తూ ఉండేవారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ మేళా వివాదాస్పదంగానే జరుగుతంది. సయ్యద్ సలార్ మసూద్ గాజీ వివాదాస్పద వ్యక్తి, భారతదేశ చరిత్రలో దురాక్రమణలకు, ఊచకోతలకూ అతనొక ప్రతీక.
సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్న వాడు, భారీ సంఖ్యలో ప్రజలను ఊచకోత కోసినవాడూ అయిన సయ్యద్ సలార్ మసూద్ గాజీ వంటి వ్యక్తి గౌరవార్థం కార్యక్రమాలు చేసుకోవడం సరి కాదని ఏఎస్‌పీ శిరీష్ చంద్ర స్పష్టం చేసారు. అలాంటి వ్యక్తిని గౌరవించే పద్ధతి శతాబ్దాలుగా ఉన్నప్పటికీ, అలాంటి కార్యక్రమానికి అనుమతి ఇచ్చలేమని స్పష్టం చేసారు.
నేజా మేళా ‘జాతి వ్యతిరేకం’ అని చెబుతూ ఏసీపీ శిరీష్ చంద్ర ఆ మేళా నిర్వహిస్తే శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కలుగవచ్చునని హెచ్చరించారు. అనుమతి లేకపోయినా మేళా నిర్వహించేందుకు ప్రయత్నిస్తే వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామని, అలాంటి వారి కఠిన చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. ‘‘గాజీ గురించి తెలియక చేసి ఉంటే అదొక రకం. కానీ గాజీ గురించి తెలిసి కూడా కావాలని ఈ నేజా మేళా నిర్వహిస్తే మాత్రం, అందులో భాగస్వామ్యం పంచుకునే ప్రతీ ఒక్కరూ దేశద్రోహులే’’ అన్నారు.
నేజా మేళా నిర్వహణను స్థానిక హిందువులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడిన వ్యక్తిని మహానుభావుడిగా కీర్తించడం సరికాదన్నది వారి వాదన. ఆ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జిల్లా అధికారులు మేళాకు అనుమతి నిరాకరించారు.
‘‘నేజా జెండా ఎగరెయ్యాలని ఎవరైనా ప్రయత్నిస్తే దాన్ని దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యగా పరిగణిస్తాం’’ అని ఏసీపీ స్పష్టం చేసారు.
‘సద్భావనా మేళా’ను తిరస్కరించిన నేజా కమిటీ:
2023లో సంభాల్ జిల్లా యంత్రాంగం ఈ నేజా మేళా పేరును ‘సద్భావనా మేళా’ అని మార్చాలని భావించింది. కార్యక్రమం మతపరమైన ప్రాధాన్యతను కొనసాగిస్తూ దానికున్న వివాదాస్పద చారిత్రక సంబంధాలను తొలగించాలన్నదే అప్పటి సర్కారు ఉద్దేశం. కానీ ఆ ప్రతిపాదనను నేజా కమిటీ తిరస్కరించిది.
డాక్టర్ వందనా మిశ్రా అనే సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ మొదట్లో అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. మేళాను దాని యథాతథ రూపంలో జరపలేమని చెప్పారు. పేరు మార్చడానికి నేజా కమిటీ మొదట ఒప్పుకుంది., కానీ తర్వాత కథ మారిపోయింది. నేజా మేళాను అదే పేరుతో మాత్రమే నిర్వహించాలని పట్టు పట్టింది. దాంతో వారి విజ్ఞప్తిని జిల్లాయాజమాన్యం నిరాకరించింది.
నేజా మేళా చరిత్ర ఏమిటి:
ప్రతీ యేడాదీ హోలీ తర్వాత వచ్చే రెండో మంగళవారం నాడు నేజా మేళా అనే పేరుతో వార్షికోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆ మేళా సయ్యద్ సలార్ మసూద్ అలియాస్ గాజీ మియా అలియాస్ గాజీ మియా అనేవాడి జ్ఞాపకార్థం నిర్వహిస్తారు. ఆ వేడుకలో భాగంగా ముస్లిం సంప్రదాయం ప్రకారం జెండా తీసుకొస్తారు. బహ్రెయిచ్‌లోని సలార్ గాజీ మందిరంలో ప్రార్థనలు (ఫతీహా) చేస్తారు. ముస్లిములు దాన్ని మతపరమైన ప్రాధాన్యం ఉన్న సంఘటనగా భావిస్తారు. అయతే దాని చరిత్ర కారణంగా అది ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది.
సయ్యద్ సలార్ మసూద్ మధ్యయుగాల నాటి సేనాధిపతి. భారత్‌పై 17సార్లు దండయాత్రలు చేసిన దుర్మార్గుడూ, దురాక్రమణదారుడూ అయిన మహమ్మద్ గజినీ మేనల్లుడు. తన మేనమామ అడుగుజాడల్లో నడిచిన గాజీ మియా ఉత్తర భారతదేశం అంతటా దుర్మార్గంగా యుద్ధాలు చేసాడు. హిందువుల స్థిర నివాసాలపై దాడులు చేసి, వాటిని ధ్వంసం చేయడమే గాజీ మియా పని. అతని ఆక్రమణలతో బలవంతపు మతమార్పిడులు జరిగాయి. ప్రధాన హిందూ దేవాలయాలు అపవిత్రమయ్యాయి. వాటిలో ముఖ్యమైనవి బహ్రెయిచ్‌లోని సూరజ్‌కుండ్ ఆలయం, సోమనాథ్ లోని ప్రధాన దేవాలయం.
మసూద్ విస్తరణకు శ్రావస్తికి చెందిన రాజా సుహేల్‌దేవ్ అడ్డుకట్ట వేసారు. ధైర్యసాహసాలకు పెట్టింది పేరయిన రాజా సుహేల్‌దేవ్, మసూద్ దాడులకు వ్యతిరేకంగా పలువురు చిన్నచిన్న ప్రాంతీయ పాలకులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. సామాన్యశకం1034లో బహ్రెయిచ్ యుద్ధంలో సుహేల్‌దేవ్ సేనలు మసూద్ సైన్యాన్ని ఓడించాయి. ఆ యుద్ధంలో మసూద్ హతమయ్యాడు. దాంతో ఉత్తర భారతంలో మరిన్ని ఆక్రమణలు జరగకుండా భారతదేశం స్వేచ్ఛగా నిలిచింది.
చరిత్రకారుల వివరాల ప్రకారం 1034 సామాన్య శకంలో మసూద్ చనిపోయాక అతనికి బహ్రెయిచ్‌లో సమాధి కట్టారు. కాలక్రమంలో ఆ ప్రదేశం స్థానికులకు పర్యాటక స్థలంగా మారింది. 1250లో నసీరుద్దీన్ మహమ్మద్ అనే ఢిల్లీ నవాబు ఆ సమాధిని పెద్దగా అభివృద్ధి చేసాడు. ముస్లిం పాలకుల సందర్శనలు, భక్తుల విరాళాలతో క్రమంగా ఆ సమాధి ఒక దర్గాగా మారిపోయింది.
క్రమంగా ఆ ప్రాంతంలో ముస్లిములు నేజా మేళా పేరుతో తమ మతపరమైన పండుగగా జరుపుకోవడం మొదలు పెట్టారు. అయితే గాజీ మియా చరిత్ర కారణంగా ఆ మేళా ఎప్పుడూ ఘర్షణలకు కారణంగానే నిలుస్తూ వచ్చింది. ముస్లిములు గాజా మియాను తమ వీరుడిగా పూజిస్తూంటే, హిందువులు అతన్ని తమ విధ్వంసకుడిగా పరిగణిస్తున్నారు.
ఇటీవలి కాలంలో, చారిత్రక కథనాలను పునఃపరిశీలిస్తూ పునర్మూల్యాంకనం చేస్తున్న వేళ నేజా మేళా మీద చర్చలు పెరిగాయి. ఇన్నాళ్ళూ మరుగున పడిన రాజా సుహేల్‌దేవ్ విజయగాధకు గుర్తింపు లభిస్తోంది. విదేశీ దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన సుహేల్‌దేవ్‌కు గౌరవం దక్కుతోంది. ప్రభుత్వం కూడా సుహేల్‌దేవ్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటోంది, ఆయనకు స్మారకాలు నిర్మిస్తోంది, చరిత్రలో ఆయనకు తగిన స్థానాన్ని కల్పిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ యేడాది నేజా మేళాకు అనుమతి నిరాకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నేజా మేళా కోసం ముస్లిం కమిటీ ప్రయత్నాలు:
ఈ సంవత్సరం నేజా మేళా జరుపుకోడానికి జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించడాన్ని నేజా మేళా కమిటీ వ్యతిరేకిస్తోంది. ‘‘ఈ మేళాను మేము ఎన్నో తరాల నుంచీ నిర్వహిస్తున్నాము. ఇది మా విశ్వాసంలో ప్రధాన ఘట్టం. ఈ మేళా కొనసాగేలా మా పోరాటం సాగుతుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం’’ అని నేజా మేళా కమిటీ అధ్యక్షుడు షహీద్ హుసేన్ మసూదీ ప్రకటించారు.
అదలా ఉండగా, మేళా ప్రారంభానికి గుర్తింపుగా ఏటా చేపట్టే కార్యక్రమాలను ఈ యేడాది చేయడానికి వీల్లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేసారు. ‘‘నేజా మేళా సాంస్కృతిక వారసత్వం కాదు, అదొక దుర్మార్గమైన సంప్రదాయం’’ అని ఏసీపీ శిరీష్ చంద్ర హెచ్చరించారు.