ఐదు కీలక రంగాల్లో పరిశోధనా సహకారం అందించేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ధాతృత్వ సంస్థ గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. బిల్‌గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో విద్య, వైద్యం,ఆరోగ్యం, మెడ్ టెక్, వ్యవసాయ రంగాల్లో పలు సమస్యల పరిష్కారానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ కృషి చేయనుంది. ఇందుకు సంబంధించి ఐదు రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి సాయం అందించేందుకు మైక్రోసాఫ్ట్ మాజీ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఏపీ ప్రభుత్వం తరపున ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ బుధవారంనాడు ఢిల్లీలో కీలక ఒప్పందం చేసుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా బిల్‌గేట్స్ స్వచ్ఛంద సంస్థ 54 దేశాల్లో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో పలు రంగాల్లో పరిశోధనలు చేస్తూ కొత్త పరికరాల ఆవిష్కరణలు చేస్తోంది. భారత్‌లో తొలిసారి ఏపీ ప్రభుత్వంతో బిల్‌గేట్స్ ఫౌండేషన్ కీలక ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వైద్య రంగంలో సమస్యల పరిష్కారానికి పలు ఆవిష్కరణలు చేయనున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలను సులభతరం చేసే పరికరాల ఆవిష్కరణకు పలు సంస్థలకు సహకారం అందించనున్నారు. దీని ద్వారా రోగ నిర్ధారణ తక్కువ ఖర్చుతో, త్వరగా జరగనుంది. ఆవిష్కరణలు ప్రజలకు ఎంతో మేలు చేయనున్నాయి.
విద్యారంగంలోనూ గేట్స్ ఫౌండేషన్ విశేష సేవలు అందిస్తోంది. విద్యార్థులు సులభంగా విద్యను నేర్చుకునే విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలు పరిశీలించి, మన రాష్ట్రానికి ఏది అవసరమో అది అందించనున్నారు. డేటా ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడని బిల్‌గేట్స్ ఒప్పందం సందర్భంగా ఢిల్లీలో కొనియాడారు.
వ్యవసాయరంగంలో కీలక పరిశోధనలకు గేట్స్ ఫౌండేషన్ సాయం చేయనుంది. దీని ద్వారా ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుని పంటల చీడపీడల నివారణ సాధ్యం చేయనున్నారు. పరిశోధనా ఫలాలు అందరూ సులభంగా ఉపయోగించుకునే సదుపాయం కల్పించనున్నారు.
దేశంలో ఏపీ ప్రయోగం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. బిల్‌గేట్స్‌తో తన అనుభవాలను ఢిల్లీ వేదికగా పంచుకున్నారు. ఏపీలో సాయం చేయాలని అడగగానే వెంటనే గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చినట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.
ప్రజల ఆరోగ్యం విషయంలో గేట్స్ ఫౌండేషన్ పలు పరిశోధనలు చేయనుంది. ప్రజలకు వచ్చే జబ్బులను ముందే గుర్తించి,తగిన చర్యలు తీసుకునే విధానాలు అమలు చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రజలు రోగాలభారిన పడకుండా కాపాడటం, జబ్బులను గుర్తించే విధానాలను సులభతరం చేసేందుకు పలు సంస్థలతో కలసి పనిచేయనున్నారు. దీని ద్వారా కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. కొత్త ఆవిష్కరణలు అందరూ ఉపయోగించుకునే సదుపాయం కల్పిస్తారు. వీటికి ఎలాంటి పేటెంట్లు ఉండవు.
కొత్త ఆవిష్కరణల కోసం తమతో ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. ఒప్పందం తరవాత తాజాగా ఎక్స్‌వేదికగా ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు పరిశోధనలు చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఆవిష్కరణలు ఉపయోగ పడతాయన్నారు.
బిల్‌గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ 2000 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రపంచంలో అతిపెద్ద దాతృత్వ సంస్థల్లో గేట్స్ ఫౌండేషన్ మూడో స్థానంలో నిలిచింది. ఈ సంస్థకు 5.6 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ప్రపంచ కుబేరుడు స్టాక్ మార్కెట్ మాంత్రికుడు వారెన్ బఫెట్ తన ఆస్తుల్లో 90 శాతం గేట్స్ ఫౌండేషన్‌కు దానం చేశారు. ప్రపంచంలో పేదరికం లేని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం గేట్స్ ఫౌండేషన్ తన వంతు సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు గేట్స్ ఫౌండేషన్ ద్వారా రూ.3 లక్షల కోట్ల సాయం అందించారు. 200 కోట్ల ప్రజలకు వారి సేవలు అందుతున్నాయి.