ముఖ్యనేతలు, సీనియర్లు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. అధిష్టానం తీరు సరిగా లేదంటూ, నియోజకవర్గాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ పార్టీకి దూరం అవుతున్నారు. 2024 ఎన్నికల ముందు నుంచి ఆ పార్టీ ఈ సమస్యను ఎదుర్కొంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తర్వాత నుంచి మరింత దారుణంగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది.
నేతలు పోతే ఏమౌతుంది కేడర్ ఉందని ఆ పార్టీ కోర్ కమిటీ చెబుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఆ పార్టీకి నియోజకవర్గాల్లో నాయకత్వం దొరకడం కష్టంగానే ఉంది. రాజ్యసభ పదవికీ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ భవిష్యత్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ దెబ్బ ఇంకా మానకముందే తాజాగా ఆ పార్టీకి శాసనమండలిలోను ఎదురుదెబ్బ తగిలింది.
చిలకలూరి పేటకు చెందిన కీలక నేత మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో నాలుగేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన రాజీనామాకు సిద్ధపడటంతో నియోజకవర్గ రాజకీయాల్లో పెద్దమార్పే చోటుచేసుకునేలా ఉంది.
మండలి ఛైర్మన్ మోషేనురాజును కలిసి నిబంధనలకు అనుగుణంగా రాజీనామా పత్రాన్ని రాజశేఖర్ అందజేశారు.
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ, రాజశేఖర్‌తో మాట్లాడారు. రాజీనామా ను వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ రాజశేఖర్, సత్తిబాబు సూచనను సున్నితంగా తిరస్కరించినట్లు తోటి ఎమ్మెల్సీలు మాట్లాడుకుంటున్నారు.‘ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా.. చిలకలూరిపేటకు వెళ్లి మా కార్యకర్తలతో మాట్లాడాక వైసీపీకి రాజీనామాపై స్పష్టతిస్తా’ అని రాజశేఖర్ తోటి ఎమ్మెల్సీలు, విలేకర్లతో చెప్పారు.
మర్రి రాజశేఖర్, చిలకలూరి పేట ఎమ్మెల్యేగా 2004లో విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఫ్యాన్ గుర్తు పై పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ స్థానం నుంచి విడుదల రజనీ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రిగానూ ఆమె పదోన్నతి పొందారు.
రాజశేఖర్ కు టికెట్ ఇవ్వకపోవడంపై ఎన్నికల ప్రచారంలో స్పందించిన వైసీపీ అధినేత జగన్, ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రిపదవి ఇస్తామని వాగ్దానం చేశారు. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.
అయితే 2024 ఎన్నికల వేళ విడుదల రజినీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమస్థానంలో పోటీలో నిలిపారు. ఆ సమయంలో చిలకలూరిపేట టికెట్ ను రాజశేఖర్ ఆశించగా మరోసారి నిరాశే మిగిలింది. కావటి మనోహర్ నాయుడును ఆఖరి నిమిషంలో వైసీపీ అధిష్టానం పోటీకి నిలిపింది. కానీ ఆ పార్టీకి విజయం దక్కలేదు. మనోహర్ నాయుడు కూడా వైసీపీని వీడారు.
తాజాగా విడుదల రజినీకే చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ వైసీపీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో మనస్తాపం చెందే మర్రి రాజశేఖర్ వైసీపీకి దూరం అవుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిలకూరిపేటలో రెండు వర్గాలుగా వీడిపోయి మర్రి రాజశేఖర్, విడుదల రజినీ ఆధిపత్యం కోసం పోటీపడ్డారు.
దాడులు, ప్రతిదాడులతో పాటు పోలీసు కేసులతో ఇరువర్గాలు అధిష్టానాన్ని ఇబ్బందిపెట్టాయి.
విడుదల రజినీ కారణంగానే లావు క్రిష్ణదేవరాయులు వైసీపీని వీడి టీడీపీ చేరారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. నర్సరావుపేట ఎంపీ హోదాలో క్రిష్ణదేవరాయులకు దక్కాల్సిన గౌరవం వైసీపీ హయాంలో చిలకలూరిపేటలో దక్కలేదని ఆయన అనుచరులు ఇప్పటికీ చెబుతున్నారు. తాజాగా పేట పగ్గాలు మళ్లీ రజినీకే అప్పగించడంతో వైసీపీ కోర్ కమిటీ తీరుపై మర్రి రాజశేఖర్ వర్గం అసంతృప్తి గా ఉంది. మర్రి రాజశేఖర్ వైసీపీని వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
మర్రి రాజశేఖర్ వైసీపీని వీడితే జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లో ఏ పార్టీలో చేరతారనేది అంతుబట్టడం లేదు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మండలి లాబీలో విలేకర్లతో రాజశేఖర్ తెలిపారు.
వైసీపీ తరఫున మండలిలో అడుగుపెట్టిన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత కూడా ఇప్పటికే రాజీనామాసం ఎదురుచూస్తున్నారు.
శాసనసభలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ బలం, మండలిలోనూ తగ్గిపోతుండటంపై ఆ పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.