వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరుగాంచిన వ్యక్తులు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రంగాల్లో నిష్ణాతులుగా పేరుగాంచిన నలుగురు వ్యక్తులను సలహాదారులుగా నియమించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ శ్రీధర ఫణిక్కర్ సోమనాథ్, కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి, భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఆ పదవుల్లో కొనసాగనున్నారు.
భారత్ బయోటెక్‌తోపాటు, ఎల్ల ఫౌండేషన్‌కు ఎండీగా వ్యవహరిస్తున్న సుచిత్ర ఎల్లా, కొవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్‌ను అందించడంతో పాటు, బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికిగాను 2022లో భర్త డాక్టర్ కృష్ణ ఎల్లతో సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
చేనేత, హస్తకళల రంగాల సుస్థిరత, బలోపేతం, అభివృద్ధికి అవసరమైన సలహాలు ఆమె అందించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల్ని సూచించడం, మార్కెట్ అవకాశాలను పెంచడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కళాకారులు, సహకార సంస్థలు, ఎంఎస్ఎంఈలకు మద్దతివ్వనున్నారు. అలాగే మహిళా కళాకారులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించడంలో సూచనలు అందజేస్తారు.
రక్షణ రంగ శాస్త్రవేత్త సతీష్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనగతంలో రక్షణమంత్రికి శాస్త్ర సలహాదారుగా పనిచేశారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశోధన, తయారీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయడానికి మార్గదర్శకత్వం వహించనున్నారు
అభివృద్ధి చెందుతున్న రక్షణ, సాంకేతికతలకు అనుగుణంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటుకు మద్దతివ్వడంపై ఆయన దృష్టిసారించనున్నారు.
ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీసీ గాంధీ సంబంధిత రంగంలో తన అమూల్యమైన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ పురోగతికి అందించనున్నారు.
రాష్ట్రంలో ఫోరెన్సిక్ మౌలిక వసతులు, మానవ వనరులను మెరుగుపరిచేందుకు, నిధులు ఎలా రాబట్టాలనేదానిపై సలహాలివ్వనుననారు. నేరగాళ్ల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపునకు వీలుగా ఫోరెన్సిక్ డేటా ఇంటిగ్రేషన్‌కు సహకారం అందించనున్నారు