రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశం ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ ఈ సంవత్సరం బెంగళూరులో మార్చి 21,22,23 తేదీల్లో జరగనుంది. దానికి సంబంధించిన విశేషాలను సంఘ్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఇవాళ మీడియాకు వివరించారు. ఆ కార్యక్రమంలో అఖిల భారతీయ సహ ప్రచార్ ప్రముఖ్‌లు నరేంద్ర కుమార్, ప్రదీప్ జోషీ, సంఘ్ దక్షిణమధ్య క్షేత్ర కార్యవాహ ఎన్ తిప్పేస్వామి పాల్గొన్నారు.
ఆర్ఎస్ఎస్ శతజయంతి జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో నిర్వహించే వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) కార్యక్రమానికి ప్రాధాన్యం ఉంది. ఆ కార్యక్రమాన్ని వచ్చే శుక్ర, శని, ఆదివారాల్లో బెంగళూరు చన్నెనహళ్ళిలోని జనసేవా విద్యాకేంద్ర ఆవరణలో నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం మార్చి 21 ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. సంఘం సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలే సంయుక్తంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఏబీపీఎస్ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో సంఘ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల స్థితిగతుల గురించి నివేదిక సమర్పిస్తారు. తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంఘ బాధ్యులు తమతమ ప్రాంతాల్లో సంఘ్ కార్యకలాపాల గురించి, ఇతర కార్యక్రమాల గురించీ నివేదికలు సమర్పిస్తారు.
ఆర్ఎస్ఎస్ ఈ యేడాది శతజయంతి జరుపుకుంటుంది. ఆ సందర్భంగా సంఘ విస్తరణ కార్యక్రమం గురించి వివరిస్తారు. 2025 విజయదశమి నుంచి 2026 విజయదశమి వరకూ శతజయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలని ప్రణాళిక రచిస్తున్నారని సునీల్ అంబేకర్ తెలియజేసారు.
భారత సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధనం, పర్యావరణ అవగాహన, స్వాభిమానం, పౌరవిధులు అనే పంచ పరివర్తనాల గురించి చర్చిస్తారు. ఈ శతజయంతి సంవత్సరంలో సంఘకార్యంలో సమాజంలోని అన్ని వర్గాలకూ భాగస్వామ్యం కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తారు.
మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో ప్రధానంగా రెండు తీర్మానాలు చేస్తారని సునీల్ అంబేకర్ మీడియాకు చెప్పారు. మొదటి తీర్మానం బంగ్లాదేశ్‌లోని ఆందోళనకర పరిణామాలు, హిందువులు-ఇతర మైనారిటీల మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఉంటుంది. గత వందేళ్ళలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రస్థానం గురించి, ఈ శతజయంతి సంవత్సరంలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి రెండో తీర్మానం ఉంటుందని వివరించారు.
కర్ణాటకకు చెందిన సాహసికురాలు రాణి అబ్బక్క పుట్టి 500 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది. 1525లో జన్మించిన రాణి అబ్బక్క దేశానికి చేసిన అమూల్య సేవలను స్మరించుకుని కొత్త ప్రేరణ పొందడానికి అదొక సదవకాశమని అంబేకర్ వివరించారు.
ఈ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించబోయే శిక్షణా కార్యక్రమాల గురించి సునీల్ అంబేకర్ చెప్పారు. ‘ప్రశిక్షణ వర్గ’ అని వ్యవహరించే ఆ కార్యక్రమాలను కార్యకర్త వికాస వర్గ 1, కార్యకర్త వికాస వర్గ 2, సంఘ శిక్షా వర్గ అనే మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. 40ఏళ్ళ వయసులోపు వారికి 72 వర్గలు, 40ఏళ్ళు పైబడిన వారికి 23 వర్గలూ నిర్వహిస్తారని సునీల్ అంబేకర్ చెప్పారు. ఇంకా, దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్‌జీ పర్యటనల ప్రణాళికలను కూడా ఈ సమావేశాల్లో ఖరారు చేస్తారు.
అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు బెంగళూరులో నాలుగేళ్ళ తర్వాత జరుగుతున్నాయి. మూడు రోజుల సమావేశాల్లో సంఘం నుంచి ప్రేరణ పొందిన 32 సంస్థల నిర్వాహక కార్యదర్శులు (సంఘటనా మంత్రులు), నిర్వాహక సంయుక్త కార్యదర్శులు (సహ సంఘటనా మంత్రులు) పాల్గొంటారు. భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షులు, రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ సంచాలిక శాంతక్క, బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, ఏబీవీపీ జాతీయ అధ్యక్షులు రాజ్ శరణ్, విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ అధ్యక్షులు సత్యేంద్ర సింగ్, విద్యాభారతి తదితర సంస్థల బాధ్యులు పాల్గొంటారని సునీల్ అంబేకర్ వివరించారు.