ఆంధ్రప్రదేశ్‌లో విద్యను కాషాయీకరణ చేస్తున్నారంటూ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు ఆరోపణలు చేసారు. హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ల గురించి చొప్పించారని ఆరోపించారు. ఆ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్య గురించి చర్చ జరిగింది. ఆ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కూటమి ప్రభుత్వంలో విద్యను కాషాయీకరిస్తున్నారంటూ ఆరోపణలు చేసారు. దానిపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యలోకి మతాన్ని, రాజకీయాలనూ తెచ్చి వివాదాలు రేపవద్దన్నారు. దానికి బొత్స సత్యనారాయణ సర్దిచెప్పారు. తమ పార్టీ సభ్యుడి మాటలు తప్పయితే రికార్డుల నుంచి తొలగించాలని సూచించారు. బొత్స సూచనను లోకేష్ స్వాగతించారు.
లోకేష్ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 8వేల బడుల్లో ‘ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు’ అనే విధానాన్ని తీసుకొస్తామన్నారు. త్రిభాషా సూత్రం గురించి మాట్లాడుతూ హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని వివరించారు. మాతృభాషను తప్పకుండా ప్రోత్సహించాలని కేంద్రం చెప్పిందని గుర్తు చేసారు. టీచర్ల బదిలీల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకుండా చేయడానికి చట్టం చేస్తామని లోకేష్ శాసనమండలిలో ప్రకటించారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గిస్తామని, ఒక సమగ్ర యాప్‌ను తీసుకొస్తామనీ చెప్పారు. పాఠశాలల్లో రేటింగ్స్ విధానం అమలు చేస్తామన్నారు. స్కూళ్ళలో మౌలిక వసతుల కల్పన కోసం ‘మన బడి – మన భవిష్యత్తు’ పేరిట ఒక పథకాన్ని తీసుకొచ్చే ఉద్దేశంలో ఉన్నామని లోకేష్ వివరించారు.
వైఎస్ఆర్‌సిపి హయాంలో విద్యావ్యవస్థను నాశనం చేసారని లోకేష్ ఆరోపించారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ఏకంగా 12లక్షలు తగ్గిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏ సౌకర్యాలూ లేనందునే విద్యార్ధులు ప్రభుత్వ బడులను వదిలిపెట్టి ప్రైవేటు పాఠశాలల్లో చేరారని ఆవేదన వ్యక్తం చేసారు. వైసీపీ హయాంలో ఐబీ పద్ధతి మీద నివేదిక కోసం 5కోట్లు ఖర్చు పెట్టారని, ఆ పద్ధతిని ఎక్కడ అమలు చేసారో చూపించగలరా అని ప్రశ్నించారు. టోఫెల్ పేరుతో 60 కోట్లు ఖర్చు పెట్టారనీ, అదంతా వృధా అయిపోయిందనీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖలో పెద్దయెత్తున సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగు పరుస్తున్నామని లోకేష్ చెప్పుకొచ్చారు.