ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదురింది. ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, విద్య, వ్యవసాయం రంగాల్లో తక్కువ ఖర్చుతో పరిష్కారాలను కనుగొని ప్రజల సంక్షేమం కోసం సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఏపీ సీఎం చంద్రబాబు, దిల్లీ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి దిశగా ఇరువురు అనేక అంశాలపై సమాలోచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన భాగస్వాములకు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో వివిధ ప్రయోజనాల కోసం గేట్స్ ఫౌండేషన్ మద్దతు ఇవ్వనుంది.
ఆరోగ్య విశ్లేషణ, ఆటోమేటెడ్ డయాగ్నస్టిక్స్ కోసం ఏఐని ఉపయోగించడంలో సాయం అందించనుంది. గేట్స్ ఫౌండేషన్ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్రాభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పునరుద్ఘాటించారు.
డేటా ఆధారిత ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని బిల్ గేట్స్ ప్రశంసించారు.