ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం శాసనసభలో సభ్యులు ఆహారకల్తీ గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఆహార పదార్ధాల అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతులు వంటి అంశాల నియంత్రణ, పర్యవేక్షణ విషయంలో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఆ చట్టం రాష్ట్రంలో ఆహార భద్రతా అధికారుల ఆధ్వర్యంలో అమలవుతోందని వివరించారు. ఆహార భద్రత కమీషనర్, అడ్జుడికేటింగ్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్ట్, జిల్లా అధికారులు, ఇతర చట్టబద్ధమైన కార్యనిర్వాహక విభాగాలూ ఆ చట్టం అమలును పర్యవేక్షిస్తున్నాయని వివరించారు. ఆహార భద్రత అధికారులు తమ అధికార పరిధిలో వున్న తయారీదారులు, హోల్ సేలర్లు, రిటైలర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారని చెప్పారు. ఆహార నమూనాలను సేకరించి సమీప ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నారని, 2006 నుంచీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిబంధనల ప్రకారం సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు.
2019-2024 మధ్య కాలంలో మొత్తం 45,509 ఆహార నమూనాలను సేకరించి విశ్లేషించారు. అందులో 2,473 నమూనాలు నిబంధనలను ఉల్లంఘించినట్లున్నాయి. 654 నమూనాలు సురక్షితం కావని తేలింది. 1,779 నమూనాలు తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాయని మంత్రి వివరించారు. సురక్షితం కాని ఆహార నమూనాలకు సంబంధించి విచారణకు, పెనాల్టీతో జైలు శిక్ష విధించేందుకు సంబంధిత జిల్లాల మేజిస్ట్రీట్ కోర్టు సమక్షంలో కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు.
ఆహార భద్రతా చట్టం నిబంధనల ప్రకారం నేర తీవ్రతను బట్టి జరిమానాలు, జైలు శిక్షలూ ఉంటాయని మంత్రి వివరించారు. చిన్న నేరాలకు లక్ష నుండి 10 లక్షల రూపాయల వరకూ జరిమానాలు పడతాయని చెప్పారు. పెద్ద నేరాలకు కనీసం ఆరు నెలల నుండి ఆరేళ్ళ వరకూ జైలు శిక్ష పడుతుందని వివరించారు. ఆహారం తినటం వల్ల వ్యక్తి మరణిస్తే కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుందని, దాన్ని జీవిత ఖైదు వరకూ పొడిగించవచ్చన్నారు. దానితో పాటు రూ.10 లక్షలకు పైబడిన జరిమానా కూడా విధించవచ్చన్నారు.
ఇప్పటి వరకూ దాదాపు 1,365 చిన్న నేరాల కేసులను, 110 పెద్ద నేరాల కేసులను జాయింట్ కలెక్టర్, అడ్జుడికేటింగ్ అధికారి నిర్ణయించారని, రెండు సందర్భాలలో మొత్తం రు.1.69 కోట్ల మేర జరిమానా విధించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.