సునీతా విలియమ్స్ బృందం రోదసి నుంచి క్షేమంగా భూమికి రావడంతో ప్రపంచమంతా హర్షాతిరేకాలతో నిండిపోయింది. ఇంక సునీత స్వగ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుంది. గుజరాత్‌లోని సునీత స్వగ్రామమైన ఝులాసాన్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. తమ ఊరి ఆడబడుచు సురక్షితంగా భూమికి చేరుకున్న వేళ, ఝులాసాన్ గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసారు. హారతులు ఇచ్చారు.
డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగడంతో సంబరాలు మొదలయ్యాయి. ఆ నౌకలోనే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు.
తొమ్మిది నెలలు రోదసిలో చిక్కుబడిపోయిన సునీత బృందం ఎట్టకేలకు మంగళవారం భూమికి బయలుదేరింది. ఆ బృందం క్షేమంగా భూమికి తిరిగి రావాలని కోరుకుంటూ సునీత కజిన్ అయిన దినేష్ రావల్ అహ్మదాబాద్‌లో యజ్ఞం చేయించారు. ఆ ప్రయత్నం ఫలించి సునీత బృందం క్షేమంగా భూమికి చేరుకోవడంతో వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది.
తాము సురక్షితంగా భూమికి చేరామన్న సందేశాన్ని మొదట బాహ్య ప్రపంచానికి చెప్పింది కమాండర్ నిక్ హేగ్. ‘‘ఆ చెవి నుంచి ఈ చెవి దాకా నవ్వుతున్నాం’’ అనే సందేశాన్ని బైటకు పంపించాడతను. ఆ సందేశాన్ని విన్న వెంటనే నాసా, స్పేస్ ఎక్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్‌లో శాస్త్రవేత్తలు ఆనందంతో ఎగిరి గంతేసారు.
వ్యోమనౌక సముద్రంలోకి చేరగానే నాసాకు చెందిన హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్ బృందం… వ్యోమగాములు భూమ్యాకర్షణ శక్తికి మళ్ళీ అలవాటు పడడంలో సహాయం అందించారు. సునీత బృందం స్పేస్ఎక్స్ వారి రెస్క్యూ షిప్‌లోకి చేరగానే వారికి ప్రాథమికమైన మెడికల్ చెకప్‌లు చేసారు. తర్వాత వారిని హ్యూస్టన్‌లోని నాసా కేంద్రానికి చేర్చారు. అక్కడ మరికొన్ని వారాల పాటు వైద్యపరీక్షలు కొనసాగుతాయి.
నాసా శాస్త్రవేత్తలు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్… సుమారు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుబడిపోయారు. వారి భద్రత గురించి భూమిమీద ఎన్ని ఆందోళనలు నెలకొన్నా… వారు మాత్రం పూర్తి ధైర్యంగానే ఉన్నారు. ఏనాడూ తమను అందరూ వదిలిపెట్టేసారన్న భయం కలగలేదని వారు చెప్పారు.