విచారణ అనంతరం సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
కొంతమంది ప్రభుత్వాధికారుల అక్రమార్జనకు అడ్డుఅదుపూ లేకుండా పోతుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను పీడించడమే అలవాటుగా పెట్టుకున్నారు. ఓ ఎస్సై అవినీతి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏ మాత్రం దయ లేకుండా వ్యవహరించాడు. లంచం కోసం వివాహిత మెడలోని మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టించాడు.
గతంలో చిత్తూరు జిల్లాలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తించిన సీవీ నరసింహులు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం జరిపిన విచారణలో విస్తుపోయి విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు సదరు ఉద్యోగిపై ఈ నెల 15న క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే….
చిత్తూరు జిల్లా సోమల ఎస్సైగా నరసింహులు పనిచేసిన సమయంలో 2023 సెప్టెంబరులో ఓ మహిళ అదృశ్యమైంది. ఆమె భర్త ఫిర్యాదు చేయడంతో కేసు నమైదైంది. దీంతో మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు వచ్చి కుటుంబపరమైన వివాదాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటానని ఎస్‌ఐకి వివరించింది. అయితే అందుకు రూ.లక్ష ఇవ్వాలని ఆమెను ఎస్‌ఐ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద అంత డబ్బు లేదని ఆమె చెప్పగా.. మెడలో మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. తెలిసిన తాకట్టు వ్యాపారి వద్దకు పంపి.. ఆమె ఫోన్‌పే నుంచి ఎస్సై రూ.60 వేలు బదిలీ చేయించుకున్నాడు.
విషయం బయటకు పొక్కడంతో కానిస్టేబుల్ ద్వారా వడ్డీ సహా ఆమెకు నగదు తిరిగి చెల్లించాడు. మరో కేసులోనూ లంచం డిమాండ్. కమ్మపల్లిలో రెండు వర్గాల మధ్య వివాదం జరగగా ఓ వ్యక్తిని కేసులో ఇరికించేందుకు ఓ వర్గం నుంచి రూ.7 లక్షలు తీసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోన్న ఆ యువకుడిపై కేసు నమోదు కావడంతో అమెరికా వెళ్లే అవకాశాన్ని కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. యువకుడి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులకు విచారణ చేపట్టగా అవినీతి వాస్తవమేనని నిర్ధారించారు.
రూ.3 లక్షల విలువైన వెదురుకర్రలు దొంగిలించారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా తప్పుడు కేసుగా పేర్కొంటూ మూసేశారు. వీటన్నింటిపై అనంతపురం డీఐజీ షేముషీ బాజ్‌పేయి చౌడేపల్లె సీఐతో విచారణ జరిపించారు. ఆరోపణలన్నీ వాస్తవాలేనని తేలడంతో నరసింహులును సస్పెండ్ చేశారు.
నర్సింహులు ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆస్పరి స్టేషన్‌లో పనిచేస్తుండగా ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.