తొమ్మిది నెలలుగా రోదసిలో చిక్కుబడిపోయి, ఎట్టకేలకు ఈ తెల్లవారుజామున భూమికి సురక్షితంగా చేరుకున్న వ్యోమగాములకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్వాగతం పలికింది. ఈ యాత్ర విజయవంతం కావడంలో సహకరించిన స్పేస్ ఎక్స్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పింది. సునీత, బుచ్ విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన సందర్భంలో నాసా అధికారులు మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ఎంత మంచి ఫలితాలను సాధించగలదో స్పేస్ ఎక్స్ చాటిచెప్పింది. డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ భూమిని చేరేటప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది. లాండింగ్‌లో ఎలాంటి ఇబ్బందులూ ఎదురవలేదు. సాగర జలాల్లో రక్షణ బాధ్యతలను అమెరికా కోస్ట్‌గార్డ్ చక్కగా నిర్వహించింది. ఐఎస్ఎస్ నుంచి స్పేస్ క్యాప్సూల్ అన్‌డాకింగ్ మొదలు ఫ్లోరిడా దగ్గర సాగర జలాల్లో సాఫ్ట్ ల్యాండింగ్ వరకూ అంతా సాఫీగా జరిగింది. ఒక స్పేస్ షిప్‌లో వెళ్ళిన వారు మరో స్పేస్ షిప్‌లో తిరిగి వచ్చారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు కొత్త దారిని చూపించాయి’’ అని నాసా ప్రకటించింది.
వ్యోమగాముల బృందం చేసిన పరిశోధనల గురించి కూడా నాసా చెప్పుకొచ్చింది. ‘‘సునీతా విలియమ్స్ ఈ పర్యటనలో రెండుసార్లు స్పేస్‌వాక్ చేసారు. క్రూ-9 ఆస్ట్రోనాట్స్ 150కి పైగా ప్రయోగాలు చేసారు. ఐఎస్ఎస్‌లో ఉన్నప్పుడు స్టెమ్‌సెల్స్ టెక్నాలజీ మీద పరిశోధనలు చేసారు. సునీత, బుచ్ విల్మోర్ ద్వయం రోదసిలో కొన్ని నమూనాలను సేకరించారు. వాటిపై నాసా పరిశోధనలు చేస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.
2024 జూన్ 5న అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 8 రోజుల రోదసీ యాత్ర కోసం బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్ ద్వారా అంతర్జాతీయ రోదసీ కేంద్రానికి వెళ్ళారు. ఆ ప్రయాణంలోనే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వ్యోమగాములను ఐఎస్ఎస్‌లో క్షేమంగా చేర్చగలిగిన వ్యోమనౌక తిరుగు ప్రయాణానికి సహకరించలేకపోయింది. దాంతో స్టార్‌లైనర్ వ్యోమగాములు లేకుండానే తిరిగి వచ్చింది. తర్వాత వారిని వెనక్కు తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇంత సుదీర్ఘకాలం సునీత, బుచ్ విల్మోర్ రోదసిలో ఉండిపోవడంతో వారి ఆరోగ్యం మీద ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.