కృష్ణా జిల్లాలో అసహాయ స్థితిలో ఉన్న ఒక బాలికను నిర్బంధించి ఏడుగురు యువకులు రేప్ చేసిన దుశ్చర్య వెలుగుచూసింది. బాధిత బాలిక మాటలాడలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసులు ఆమోనున ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కేసు గురించి కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి 9న ఎన్‌టిఆర్ జిల్లా జి కొండూరు గ్రామానికి చెందిన 14ఏళ్ళ బాలిక పొరుగింటి మహిళతో కలిసి ఆమె ఊరైన వీరపనేనిగూడేనికి వెళ్ళింది. అక్కడ చిన్న గొడవ జరగడంతో బాలిక ఆవేదనకు గురై అక్కడినుంచి బైటకు వచ్చేసింది. సొంతూరు వెళ్ళిపోవాలనుకున్న బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ఓ 15ఏళ్ళ బాలుడు, అతని రజాక్ అనే మరో యువకుడు ఆమెను కొండూరులో దింపుతామని నమ్మబలికారు. తమతో ద్విచక్రవాహనం మీద తీసుకువెళ్ళారు. అయితే బాలికను కొండూరు తీసుకువెళ్ళకుండా ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆమెను రేప్ చేసారు.
తర్వాత వారు ఆ బాలికను మరో ఇద్దరు యువకుల దగ్గరకు తీసుకువెళ్ళారు. అనిల్, జితేంద్ర అనే ఇద్దరూ ఆ బాలికను రేప్ చేసారు. తర్వాత కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్, మరో యువకుడు కూడా రేప్ చేసారు. అలా మొత్తం ఒక మైనర్ బాలుడు, ఆరుగురు యువకులు ఆ బాలికను నాలుగు రోజులు నిర్బంధించి రేప్ చేసారు. చివరికి మార్చి 17న బాధిత బాలికను ఆటోలో తీసుకువెళ్ళి ఎన్‌టిఆర్ జిల్లా మాచవరంలో వదిలిపెట్టేసారు.
మాచవరంలో బాధిత బాలికను ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. ఆమె వివరాలు కనుక్కుని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి అప్పగించాడు. బాలిక సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. బాధిత బాలిక సరిగ్గా మాట్లాడగలిగితే నిందితుల పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. ఆలోగా బాధిత బాలిక తల్లిదండ్రులను, ఆమెను ఊరు తీసుకువెళ్ళిన మహిళనూ విచారిస్తున్నారు.