జూన్ 30 నుంచి ఏపీలో అమలు
అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి లోకేశ్
మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ ను జూన్ 30 నుంచి అందుబాటులోకి తెస్తామని , అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మాటల ద్వారా టికెట్ బుక్ చేసుకునే వీలుందని నంబర్ చెబితే విద్యుత్ బిల్లు కట్టేస్తుందని అందులోని సౌకర్యాలు వివరించారు. అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెల్లడైన వెంటనే మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామని పేర్కొన్నారు. శాసనసభలో ‘వాట్సప్ గవర్నెన్స్’పై జరిగిన చర్చలో భాగంగా మంత్రి లోకేశ్ ఈ విషయాలు వివరించారు.
‘ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలి’ అనేది ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ వివరించారు. జనవరి 30 నుంచి 155 సేవలతో వాట్సప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేసిన లోకేశ్, ప్రస్తుతం 200 సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. మార్చి నెలాఖరుకు 300, జూన్ 30కల్లా 500 సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పౌరులు అడిగిన సేవను 10 సెకన్లలో అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా ఈ వ్యవస్థలో అందించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. సర్టిఫికెట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా చెల్లుబాటయ్యేలా త్వరలో చట్టసవరణ చేస్తామన్నారు. కేంద్ర ఐటీ చట్టం ప్రకారం ఫిజికల్ పత్రాల్లాగే ఎలక్ట్రానిక్ పత్రాలూ చెల్లుబాటవుతాయి. క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరణకు వచ్చేలా శాసనసభ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించే బిల్లు తెస్తాం’ అని లోకేశ్ వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన ఘటనను లోకేశ్ ఈ సందర్భంగా సభలో వివరించారు. కూటమి నుంచి ఎక్కువ మంది సభ్యులు గెలిచినా.. బీసీ మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా అప్పటి ఎమ్మెల్యే అడ్డుపడ్డారని అన్నారు. కులధ్రువీకరణ పత్రం ఇవ్వనీయకుండా వేధించారన్నారు. అక్కడ్నుంచే ఈ ఆలోచన మొదలైందన్నారు.
వాట్సప్ గవర్నెన్స్‌లో ఎక్కడైనా హ్యాకింగ్ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తామని సవాల్ చేశారు.‘‘ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ వాడరంటున్నారని… ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక ఫోన్ కొని అందులో వాట్సప్ గవర్నెన్స్ లోడ్ చేసి పంపిస్తే అప్పుడైనా నేర్చుకుంటారేమో’’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు.