తొమ్మిది నెలల నెప్పుల తర్వాత రోదసీ గర్భం నుంచి బైటపడి, సాగర జలాల మధ్య నుంచి ఈ భూమి మీదకు చేరుకున్నారు నలుగురు వ్యోమగాములు. ఇది వారికి మరో జన్మే అని చెప్పవచ్చు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 నిమిషాలకు నలుగురు వ్యోమగాములతో కూడిన ‘క్రూ డ్రాగన్’ వ్యోమనౌక ఫ్లోరిడా దగ్గర సముద్రంలో దిగింది.
సునీతా విలియమ్స్, డబుచ్ విల్మోర్ గతేడాది జూన్ 5న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు 8 రోజుల యాత్ర కోసం వెళ్ళారు. ప్రత్యేక పరిస్థితుల్లో వారు అక్కడ చిక్కుకుపోయారు. ఏకంగా 286 రోజులు అక్కడే గడిపాల్సి వచ్చింది. వారిని వెనక్కు తీసుకురావడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా అవన్నీ రకరకాల కారణాలతో విఫలమయ్యాయి. చివరికి ఇప్పుడు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా వెనక్కి వచ్చారు. నాసా కమాండర్ నిక్ హేగ్, రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు… భూమికి తిరిగి వచ్చిన మిగతా ఇద్దరు వ్యోమగాములు.
భూమికి బయల్దేరే ముందు సునీత బృందం ఐఎస్ఎస్‌లోని ఇతర వ్యోమగాములకు వీడ్కోలు పలికారు. అందరూ కలిసి సరదాగా కాలక్షేపం చేసారు, ఫొటోలు తీసుకున్నారు. తర్వాత ఐఎస్ఎస్‌కు అనుసంధానమై ఉన్నక్రూ డ్రాగన్ స్పేస్ షిప్‌లోకి ప్రవేశించారు.
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15కు క్రూ డ్రాగన్ హ్యాచ్‌ను మూసివేసారు. ఉదయం 10.15 సమయానికి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. భూమి వైపు ప్రయాణం ప్రారంభించింది. 17 గంటల పాటు సాగే ఆ ప్రయాణం కోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన ప్రయోగాలు చేపట్టింది.
భూమి వాతావరణంలోకి వ్యోమనౌక ప్రవేశించే సమయంలో (రీఎంట్రీ) తీవ్రమైన ఉష్ణోగ్రత ఉద్భవిస్తుంది. దాన్నుంచి వ్యోమనౌకను, వ్యోమగాములనూ రక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థను క్రియాశీలం చేసారు.
అంతవరకూ శూన్యంలో ప్రయాణించిన వ్యోమనౌక భూమి దగ్గర వాతావరణంలోకి ప్రవేశించేసరికి అక్కడుండే వాయువులతో రాపిడి కారణంగా అపరిమితమైన ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతుంది. క్రూ డ్రాగన్ రీఎంట్రీ సమయంలో ఏకంగా 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి ఉత్పన్నమై, వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుంది. దాంతో స్పేస్‌షిప్‌కు భూమితో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. దాంతో కొద్దిసమయం భూమి మీద ఉత్కంఠ నెలకొంది.
అయితే స్పేస్ షిప్ చుట్టూ ఉండే ఇన్సులేషన్ కవచం ఆ అపారమైన వేడిమిని తట్టుకోవడంలో విజయవంతమైంది. ఫలితంగా స్పేస్ షిప్ భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించగలిగింది. కొద్దిసేపు కమ్యూనికేషన్ లాస్ తర్వాత రేడియో సైలెన్స్‌ను బ్రేక్ చేస్తూ కమాండర్ నిక్ హేగ్ మాట్లాడారు. ఆ సిగ్నల్స్ అందడం, నిక్ హేగ్ స్వరం వినిపించడంతో కమాండ్ సెంటర్‌లో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసింది.
ఫ్లోరిడా తీరంలోని సముద్రం వైపు స్పేస్ షిప్ ప్రయాణించింది. సాగర జలాలకు 18వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు రెండు డ్రాగ్‌చూట్స్ ఓపెన్ అయ్యాయి. అప్పటికి వ్యోమనౌక 560 కెఎంపిహెచ్ వేగానికి చేరుకుంది. చూట్స్ తెరచుకున్నాక క్రమంగా 190 కెఎంపిహెచ్‌కు చేరుకుంది. క్రూ డ్రాగన్ సముద్రం మీద 6500 అడుగుల ఎత్తుకు చేరుకునేసరికి, రెండు పారాచూట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. డ్రాగ్‌చూట్స్, పారాచూట్స్ కలిసి స్పేస్‌షిప్ వేగాన్ని నియంత్రించాయి.
ఫ్లోరిడాలోని తలహాసీ తీరం దగ్గర సముద్ర జలాల్లోకి స్పేస్‌షిప్ ల్యాండ్ అయింది. వెంటనే రికవరీ సిబ్బంది స్పీడ్‌బోట్స్‌లో అక్కడికి చేరుకున్నారు. అంతా సాధారణంగానే ఉందని నిర్ధారణ చేసుకున్నాక స్పేష్ షిప్‌ను ‘మేగన్’ రికవరీ షిప్ మీదకు చేర్చారు. ఆ తర్వాత స్పేస్‌షిప్‌లో ఉన్న నలుగురు వ్యోమగాములనూ ఒక్కొక్కరుగా బైటకు తీసుకొచ్చు. మొదట కమాండర్ నిక్ హేగ్, తర్వాత అలెగ్జాండర్ గోర్బునోవ్, సునీతా విలియమ్స్, ఆఖరుగా బుచ్ విల్మోర్ బైటకు వచ్చారు.
క్రూ డ్రాగన్ నుంచి బైటకు రాగానే సునీతా విలియమ్స్ చేతులు ఊపుతూ అందరినీ విష్ చేసారు. ఈ మొత్తం ప్రయోగం సాఫీగా సాగిపోవడంతో కమాండ్ సెంటర్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.
తొమ్మిది నెలల పాటు తల్లి గర్భంలో ఉండి ఉమ్మనీరులో నుంచి బైటి ప్రపంచంలోకి వచ్చే పాపాయిల్లా…. తొమ్మిది నెలల పాటు రోదసీ గర్భంలో చిక్కుకుపోయి… 17 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి ఫ్లోరిడా దగ్గర సముద్రపు నీటిలో తేలుతూ బైటపడి బాహ్యప్రపంచంలోకి చేరుకున్నారు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్.
ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయారని తెలియడంతో భూమిమీద అందరూ చాలా ఆదుర్దా పడ్డారు. అందునా వారిద్దరిలో ఒకరు భారత సంతతికి చెందిన మహిళ కావడంతో మన ఆడపడుచు క్షేమం మీద మన దేశస్తులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఎట్టకేలకు ఆందోళనలన్నీ తీరిపోయాయి. సునీత, బుచ్ విల్మోర్ భూమిమీదకు క్షేమంగా చేరుకోవడంతో ప్రపంచం అంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.
ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి గత జో బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గతంలోనే పలుమార్లు ఆరోపించారు. వారిని వెనక్కి తీసుకురావాలంటూ స్పేస్ ఎక్స్‌ను డొనాల్డ్ ట్రంప్ కోరారు. నాసా, స్పేస్ ఎక్స్ బృందాలు సమష్ఠి ప్రయత్నంతో వారు ఎట్టకేలకు భూమికి చేరుకోగలిగారు. దాంతో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలియజేసారు. మరోవైపు, వ్యోమగాములకు డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికారు. వారి ఫొటోలను తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో షేర్ చేసారు. వ్యోమగాముల రాక గురించి వైట్‌హౌస్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో స్పందించింది. ‘ప్రామిస్ మేడ్, ప్రామిస్ కెప్ట్’ (మాట ఇచ్చాం.. మాట నిలబెట్టుకున్నాం) అని ట్వీట్ చేసింది.