ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటలపోటీలు
విజయవాడలో మూడు రోజుల పాటు క్రీడా సందడి
అనుచరుల కోలాహలంతో పాటు, అధికారుల హడావుడి, ప్రజా సమస్యల పరిష్కారంలో క్షణం తీరికలేకుండా గడిపే ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓ మూడు రోజుల పాటు ఆటపాటలతో సేద తీరుతున్నారు. అసెంబ్లీ, మండలి బడ్జెట్ సెషన్ లో భాగంగా మండలి సభ్యులతో పాటు శాసనసభ్యులకు క్రీడాపోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు. దీంతో రోజువారీ షెడ్యూల్ కు భిన్నంగా చట్టసభ్యులు సరదా…సరదాగా గడపుతున్నారు.
ఎప్పుడూ ఖద్దర్ దుస్తుల్లో కనిపించే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పోర్ట్స్ డ్రెస్ లో డిఫెరెంట్ లుక్ లో మెరిపిపోయారు. విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం నుంచి క్రీడాపోటీలు మొదలయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా మంత్రలు, ఎమ్మెల్యేలు క్రికెట్ ఆడారు. కొందరైతే ఆటలో భాగంగా గాయపడ్డారు కూడా.
రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ‘టగ్ ఆఫ్ వార్’ ఆటలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన వయస్సు 80 ఏళ్ళు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కబడ్డీ ఆడారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు క్రికెట్‌లో ఫీల్డింగ్ తో అదరగొట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్ క్రికెట్ లో కీపర్ గా వ్యవహరించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ స్థాయిలో టెన్నిస్ పోటీల్లో పాల్గొన్నారని, గోల్ఫ్‌లోను ఆయనకు మంచి నైపుణ్యం ఉందన్నారు. టెన్నిస్‌లో ఆయనతో ఎవరైనా పోటీ పడితే ఓడిపోవడం ఖాయమన్నారు. సీనియర్ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఇప్పటికీ రోజూ గంటసేపు ఈత కొడతారని వ్యాఖ్యాతలు పేర్నొన్నారు.
క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పోటీలను ప్రారంభించగా వాలీబాల్ క్రీడాకారుడైన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్‌రాజు, విజయకుమార్, శ్రావణిశ్రీ, రాంగోపాల్‌రెడ్డి సహా పలువురు క్రీడాజ్యోతిని వెలిగించారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్ రవినాయుడి పోటీల ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు.
మంత్రులు కొల్లు రవీంద్ర, రాంప్రసాద్‌రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ పోటీల్లో పాల్గొన్నారు. కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ బౌలింగ్ చేశారు. ఆరుమ్యాచ్ లు జరగ్గా ఒక్కో మ్యాచ్ ఏడు ఓవర్లపాటు జరిగింది. అచ్చెన్నాయుడును అల్లుడు ఆదిరెడ్డి వాసు రనౌట్ చేయడం విశేషం.
త్రోబాల్ పోటీల్లో మహిళల విభాగంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రతిభ చూపారు. మంత్రి సవిత టీంలో ఉన్న ఆమె ఒక్కరే సుమారు 7 పాయింట్లు సాధించారు. హోంమంత్రి వంగలపూడి అనిత బృందంపై నాలుగు పాయింట్ల తేడాతో మంత్రి సవిత టీం విజయం సాధించింది.
వాలీబాల్ పోటీల్లో శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఆయన బృందం 4 పాయింట్ల తేడాతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బృందంపై విజయం సాధించింది.
పోటీల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కొందరికి చిన్నచిన్న గాయాలయ్యాయి. బీఎన్ విజయ్‌కుమార్, బొజ్జల సుధీర్ రెడ్డి, రాధాకృష్ణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గాయపడ్డారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్ క్రికెట్‌లో ఫీల్డింగ్ చేస్తూ పడిపోవడంతో ముఖంపై బలమైన గాయాలయ్యాయి. మైదానంలో ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు.
వైసీపీ ఎమ్మెల్సీలు పోటీల్లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. శివరామిరెడ్డి, అనంతబాబు, బల్లి కళ్యాణ చక్రవర్తి, వంకా రవీంద్ర, చంద్రగిరి ఏసురత్నం పోటీల్లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
కోడిపందేలు నిర్వహించాలంటూ కొందరు సభ్యులు సరదాగా కోరాగా ఆయను నవ్వుతూ ఇది
వేదిక కాదని సమాధానం ఇచ్చారు.
‘టగ్ ఆఫ్ వార్’ పోటీల్లో మొదట మహిళల విభాగంలో జరిగిన పోటీలో హోం మంత్రి అనిత బృందంపై గుమ్మిడి సంధ్యారాణి బృందం గెలుపొందింది. పురుషుల విభాగంలో అచ్చెన్నాయుడు, జీవీ ఆంజనేయులు, బొజ్జల సుధీర్‌రెడ్డి తదితరులతో కూడిన బృందంపై.. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, చదలవాడ అరవిందబాబు తదితరులతో కూడిన బృందం విజయం సాధించింది.
మహిళల టీంకి, పురుషుల టీంకి మధ్య పోటీ నిర్వహించారు. ఆ పోటీలో రఘురామకృష్ణరాజు బృందంపై మంత్రి సంధ్యారాణి టీం విజయం సాధించింది. గెలిచిన టీంలో మంత్రి సవిత, పరిటాల సునీత, బండారు శ్రావణిశ్రీ ఉన్నారు.
శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం 13 రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. అథ్లెటిక్స్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, వాలీబాల్, త్రోబాల్, కబడ్డీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో , షటిల్ బ్యాడ్మింటన్‌ను డీఆర్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.
క్రీడల కోసం రిఫరీలు, అంపైర్లు, సహాయకులుగా200 మంది సిబ్బందిని నియమించారు. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలుగా ఉండగా పోటీల్లో పాల్గొనడానికి 140 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. శాసనమండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా..13 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చివరి రోజు సీఎం చంద్రబాబు పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. అదే రోజు విజేతలకు సీఎం, డిప్యూటీ సీఎం బహుమతులు అందజేస్తారు.