గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ను ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తిని బెదిరించి భూమిని విక్రయించారనే అభియోగాలపై నమోదైన కేసులో గన్నవరం అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈ తీర్పు వెల్లడించారు. వంశీకి ఇది మూడో రిమాండ్. ఉంగుటూరు మండలంలోని ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది.
అనుచరులతో కలిసి వంశీ బెదిరింపులకు పాల్పడటంతో పాటు దాదాపు 8.91 ఎకరాల భూమిని విక్రయించారని తేలప్రోలుకు చెందిన ఎస్.శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. పోలీసులు సమర్పించిన పీటీ వారెంట్‌ను కోర్టు అనుమతించింది. దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి గన్నవరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు. పిటిషన్ ను విచారించిన న్యాయాధికారి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల తర్వాత విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై డాడి, సత్యవర్ధన్ అపహరణ కేసులలో అరెస్టయిన వంశీ , ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పరుపుతో పాటు ఓ కుర్చీని వాడుకునే సౌకర్యం కల్పించాలని జడ్జిని వంశీ కోరారు. అదనంగా కావాల్సిన వసతులపై ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాలని న్యాయాధికారి సూచించారు.