సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో, మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలు చేసిన అరెస్టైన వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సీఐడీ పోలీసుల విచారణలో భాగంగా ఆయన ఈ విషయాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం.
‘సాక్షి’ పత్రికవారే ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏం మాట్లాడాలనే విషయం కూడా చెప్పేవారని విచారణాధికారి ఎదుట తెలిపారు. సదరు విషయాలు నిజాలో కాదో తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్టు సమాచారం.
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ సహా పలువురిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారని పోసానిపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. గతేడాది అక్టోబరు 9న ఆయన సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘‘చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్’’లను తిట్టాలని, వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని ఎవరు చెప్పారని పోసానిని విచారణలో ప్రశ్నించగా తనకు ఎవరి నుంచి ఆదేశాలు లేవు అని సమాధానం చెప్పినట్లు తెలిసింది. తనను, తన కుటుంబాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు తిట్టడంతో అలా స్పందించేవాణ్ని అని వాపోయారు.