మహారాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని బొంబాయి హైకోర్టు కొట్టిపడేసింది. పుణేలోని హాజీ మహమ్మద్ జవాద్ ఇస్పాహానీ ఇమామ్‌బారా ట్రస్ట్‌కు వక్ఫ్ సంస్థగా హోదా కట్టబెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఇమామ్‌బారా పబ్లిక్ ట్రస్టును వక్ఫ్ సంస్థగా రిజిస్టర్ చేస్తూ 2016లో జారీ చేసిన ఆదేశాలను, వాటిని సమర్ధిస్తూ 2023లో ఇచ్చిన తీర్పునూ రెండింటినీ కొట్టిపడేసింది.
వక్ఫ్ బోర్డు సెక్షన్ 43ను తప్పుగా వ్యాఖ్యానం చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ సెక్షన్ ప్రకారం ముందరి చట్టాల ప్రకారం గుర్తించబడిన కొన్ని వక్ఫ్‌లను 1995 చట్టం ప్రకారం రిజిస్టర్ చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఒక ముస్లిం ట్రస్టు 1950 నాటి మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్టుల చట్టం కింద నమోదైనంత మాత్రాన దానికి వక్ఫ్ హోదా వచ్చేసినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ సందర్భంగా వక్ఫ్ ట్రిబ్యునల్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఫిర్యాదికి అనుమతి మంజూరు చేసారు. తద్వారా ఆ ట్రస్టు గురించి ఉన్న వివాదాన్ని స్వతంత్రంగా సెటిల్ చేసుకోవాలని సూచించారు.
ఇమామ్‌బారా అనేది పుణేలోని ప్రసిద్ధి చెందిన ఒక స్థలం. ముస్లిములలో ఒక సామాజిక వర్గానికి చెందిన మసీదు అక్కడ ఉంది. దాన్ని 1953లో మొదటిసారి ముస్లిం పబ్లిక్ ట్రస్ట్‌గా రిజిస్టర్ చేసారు. అయితే నిర్వహణ బాగోలేదన్న ఆరోపణలతో ట్రస్ట్‌ను వక్ఫ్ సంస్థగా రిజిస్టర్ చేయాలంటూ వక్ఫ్ బోర్డుకు ఒక దరఖాస్తు వెళ్ళింది. ఆ మేరకు వక్ఫ్ బోర్డు 2016లో ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్ణయాన్ని ట్రస్టీలు వక్ఫ్ ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసారు. ఆ పిటిషన్‌ను వక్ఫ్ ట్రిబ్యునల్ 2023లో తిరస్కరించింది. దాంతో ట్రస్టీలు బొంబాయి హైకోర్టులో సివిల్ రివిజన్ కేసు దాఖలు చేసారు.