మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్‌తో నాగపూర్‌లో సోమవారం సాయంత్రం విహెచ్పి, బజరంగ్ దళ్ నిర్వహించిన ఆందోళన మీద ముస్లిములు దాడి చేసారు. అయితే అది అప్పటికప్పుడు చేసిన దాడి కాదనీ, ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి అనీ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఏ ఆధారాలతో వారు ఆ నిర్ణయానికి వచ్చారు?
మహారాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ హింస మీద ప్రకటన చేసారు. పోలీసుల దర్యాప్తులో అక్కడ ఆయుధాలతో దాడులు చేయడం, రాళ్ళు రువ్విన ఘటనలు, ఎంపిక చేసుకున్న ఇళ్ళను లక్ష్యంగా చేసుకుని మూకదాడులు చేయడాన్ని గుర్తించారని వెల్లడించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా అలా ఆయుధాలను ప్రయోగించడం, హిందువుల నివాసాలపైనే దాడులు చేయడం జరగబోవని వివరించారు.
నాగపూర్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రవీణ్ డాట్కే సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ సీసీటీవీలన్నీ ధ్వంసం చేసి ఉన్నాయని చెప్పారు. హిందువుల ఇళ్ళు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని వివరించారు. దాన్నిబట్టే అవి ప్రీ-ప్లాన్డ్ అటాక్స్ అని నిర్ధారణకు వచ్చారు.
నగర పోలీసుల నిఘా వ్యవస్థ దారుణంగా విఫలమైందని ప్రవీణ్ డాట్కే ఆరోపించారు. దుండగులు ఏరికోరి
హిందువుల దుకాణాలకు నిప్పుపెట్టారు. హిందువుల వాహనాలను ధ్వంసం చేసారు. ఇళ్ళు, ఆస్పత్రులను కూడా హిందువులవే వెతికి మరీ ధ్వంసం చేసారు… అని ప్రవీణ్ చెప్పారు.
వాహనాలను ధ్వంసం చేసిన చోట పార్కింగ్‌లో ఇవాళ కేవలం హిందువుల వాహనాలు మాత్రమే ఉన్నాయని ప్రవీణ్ వివరించారు. సాధారణంగా ముస్లిముల వాహనాలు కూడా ఉండే పార్కింగ్ ప్లేస్‌లో ఇవాళ ఒక్క ముస్లిం వాహనం కూడా లేకపోవడం, ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగిందనడానికి ఒక ఆధారమని అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ముందస్తు కుట్రతో ఈ దాడులకు పాల్పడ్డారని శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే అన్నారు. ఇటీవల చేస్తున్న మంచిపనుల వల్ల ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరును చూసి ఓర్వలేక, సమయం కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కుట్ర చేసి హింసాకాండ సృష్టించారని మండిపడ్డారు.
శివసేనకే చెందిన మరో ఎంపీ నరేష్ మాస్కే ఇంకో అడుగు ముందుకేసారు. నాగపూర్‌లో హింసను రగల్చడంలో ప్రతిపక్షాల పాత్ర ఉండి ఉండవచ్చునని ఆయన అనుమానించారు. ‘‘రాష్ట్రంలో గొడవలు జరుగుతాయని ప్రతిపక్షాల నాయకులు కొద్దిరోజులుగా ఊహిస్తున్నారు. ఏం జరగబోతోందో వాళ్ళకు ముందుగానే ఎలా తెలుసు?’’ అని ఆయన ప్రశ్నించారు.