పుదుచ్చేరి విశ్వవిద్యాలయం ఆవరణలోని కంబన్ హాస్టల్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన సంఘటన వెలుగు చూసింది. మార్చి 11 అర్ధరాత్రి దాటాక ఆరుగురు విద్యార్ధులు వినాయకుడి విగ్రహాన్ని నాశనం చేసారు. ఆ విద్యార్ధులు అర్ధరాత్రి పూట హాస్టల్‌లోకి ప్రవేశించి, కావాలనే గణేశుడి మూర్తిని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారని తెలుస్తోంది.
ఆ దుశ్చర్యను అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ తీవ్రంగా ఖండించింది. వినాయక మూర్తిని ధ్వంసం చేసిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులు, ఎబివిపి సభ్యులు ఆ మేరకు యూనివర్సిటీ అధికారులకు, హాస్టల్ చీఫ్ వార్డెన్‌కు, వర్సిటీ రిజిస్ట్రార్‌కు, వైస్‌ఛాన్సలర్‌కు ఇ-మెయిల్ పంపించారు.
ఇంకా, ఎబివిపి ప్రతినిధులు స్టూడెంట్స్ వెల్ఫేర్ విభాగం డీన్‌ను కలిసి, దోషులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. జరిగిన వ్యవహారం మీద దర్యాప్తు జరపడానికి కమిటీ ఏర్పాటు చేస్తామని డీన్ హామీ ఇచ్చారు. దుశ్చర్యకు బాధ్యులైన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి రిజిస్ట్రార్‌కు పంపాలంటూ ఓఎస్‌డీకి ఆదేశాలు జారీ చేసారు.
అయితే సదరు ఓఎస్‌డీ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఆయన వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను రిట్రీవ్ చేసేవరకూ గణేశ మూర్తిని ధ్వంసం చేసిన దుర్మార్గులు ఎవరన్నది తెలిసే అవకాశం లేదు. ఈరోజు వరకూ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అందువల్ల ఎవరి మీదా ఎలాంటి చట్టపరమైన చర్యా తీసుకోలేదు.
తమిళనాడులో విశ్వవిద్యాలయాలు కూడా ఢిల్లీ జేఎన్‌యూ తరహాలో హిందూ వ్యతిరేక శక్తుల అడ్డాలుగా నిలుస్తున్నాయి. విద్యార్ధులకు చదువు నేర్పడానికి బదులు వారిని జాతి వ్యతిరేక శక్తులు, ద్రవిడ గ్రూపులు, వామపక్ష భావజాలాల ప్రతినిధులుగా తీర్చిదిద్దే కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఇప్పటికే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తోంది, సెమినార్లు నిర్వహిస్తోంది. అలాంటి పార్టీ అండ చూసుకునే హిందూ వ్యతిరేక ప్రతీప శక్తులు రెచ్చిపోతున్నాయి, విశ్వవిద్యాలయాల్లో సైతం చెలరేగిపోతున్నాయి.