కిలోల కొద్దీ అక్రమ బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లో అహ్మదాబాద్ పాల్దీ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటుపై దాడి చేసిన ఈడీ అధికారులు 88 కేజీల బంగారం, కొన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. యజమాని అపార్టుమెంటు ఫ్లాటును ఓ స్టాక్ బ్రోకర్‌కు అద్దెకు ఇచ్చినట్లు చెపుతున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
విదేశాల నుంచి అక్రమంగా తరలించిన బంగారంగా (Gold smuggling) ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. ఆభరణాలు తయారు చేసే వారికి బంగారం చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. కడ్డీల రూపంలోని స్వచ్ఛమైన బంగారం దుబాయ్ నుంచి తీసుకు వచ్చి జ్యుయలరీ వ్యాపారులకు అమ్ముతున్నట్లు ఈడీ గుర్తించింది. బంగారం నిల్వ చేసిన మహేంద్ర షా అనే స్టాక్ బ్రోకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.