పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. సోమవారం నుంచి యూనిస్, ఉత్తర గాజా, తూర్పు గాజాలపై వైమానిక దాడులతో ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో 330 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా చనిపోయినట్లు పాలస్తీనా ప్రకటించింది. రెండో విడత కాల్పుల విరమణ చర్చలు జరగాల్సిన తరుణంలో టెల్ అవీవ్ భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో హమాస్ పోలీస్, ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ మహ్మద్ అబు వత్ఫా కూడా హతమైనట్లు తెలుస్తోంది.
బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ ఉగ్రవాదులు అంగీకరించడం లేదని అందుకే భీకర దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పష్టం చేశారు. మొదటి దఫా కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో హమాస్ 20 మంది బందీలను విడుదల చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ 2 వేల మంది పాలస్తీనా ఖైదీలకు విముక్తి కల్పించింది.
తూర్పు గాజా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. బందీల విడుదలకు హమాస్ ముందుకు రాకపోవడంతో మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులు ప్రారంభించింది. ముందుగానే ఇజ్రాయెల్‌లో సరిహద్దు ప్రాంతంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పాలస్తీనాపై ఒత్తిడి పెంచేందుకు మానవతాసాయం ట్రక్కులను నిలిపివేశారు. పాలస్తీనాకు విద్యుత్ సరఫరా ఆపివేశారు.