న్యూజీలాండ్ లో పర్యటిస్తున్న పాకిస్తాన్ జట్టు రెండో ఓటమిని ఎదుర్కొంది. ఐడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు న్యూజీలాండ్ పర్యటనకు వెళ్ళింది. నేడు(మార్చి 18) జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో పాక్ ను కివీస్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా (46) టాప్ స్కోరర్ గా నిలిచాడు.షాదాబ్ ఖాన్ (26), షాహీన్ (22*) గా ఉన్నారు. మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్(11) అబ్దుల్ సమద్ (11) విఫలం అయ్యారు.
న్యూజీలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధీ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్యఛేదనలో న్యూజీలాండ్ 13.1 ఓవర్లలోనే 136 పరుగులు చేసింది. ఓపెనర్లు సీఫర్ట్ (45), ఫిన్ (38) మంచి ఆరంభం ఇచ్చారు. మిచెల్ హే (21) రాణించడంతో న్యూజీలాండ్ 5 వికెట్లు మాత్రమే నష్టపోయి విజయం సాధించింది.
పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా మహ్మద్ అలీ, కుష్దీల్ షా, జహాందాద్ ఖాన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. తాజా విజయంతో కివీస్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 తేడాతో ముందంజలో ఉంది.