చంద్రయాన్ 5 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. 2040 నాటికి చంద్రుడి మీద భారతీయుడు అడుగు పెట్టడమే చంద్రయాన్ మిషన్ ప్రధాన లక్ష్యం అని ఆయన వివరించారు.
చంద్రయాన్ 4 మిషన్‌లో చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి నమూనాలను సేకరిస్తామని ఇస్రో కొత్త చీఫ్ చెప్పారు. చంద్రయాన్ 5 మిషన్‌కు నాలుగు రోజుల క్రితమే కేంద్రం ఆమోద ముద్ర వేసిందని తెలియజేసారు. చంద్రయాన్ 5 మిషన్‌ను భారత్-జపాన్ సంయుక్తంగా నిర్వహిస్తాయని నారాయణన్ వెల్లడించారు. ఆ మిషన్‌లో 350 కేజీల రోవర్ ఉంటుందని తెలియజేసారు. స్వదేశీ తయారీ రాకెట్లో భారతీయులు చంద్రుడి మీదకు వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయమని భారత ప్రభుత్వం అడుగుతోందని నారాయణన్ చెప్పుకొచ్చారు. అలాగే, 2035 నాటికి భారతదేశపు సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని నారాయణన్ వెల్లడించారు.