ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోడానికి ముందుకు వచ్చిన ఆ మావోయిస్టులకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందజేసింది. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
సిపిఐ (మావోయిస్టు) పామెడ్ ఏరియా కమిటీకి చెందిన 19మంది కార్యకర్తలు సోమవారం ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారు. వారి మీద మొత్తం రూ.29 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రప్రభుత్వం మార్చి 12న లొంగుబాటు, పునరావాస కల్పన విధానం పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. దాంతో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారు. అలా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న వారు ఒక్కొక్కరికీ రూ.25వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. దాంతో పాటు వారి పునరావాసానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. అంతకుముందు ఆదివారం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 60మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే.