కేరళలోని కరువన్నూర్ బ్యాంక్ కుంభకోణంలో సీపీఎం ఎంపీ కె రాధాకృష్ణన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. త్రిశూర్ జిల్లాలోని కరువన్నూర్ సహకార బ్యాంకు సిపిఎం నాయకుల నియంత్రణలో ఉంది. 2016-18 కాలంలో ఆ బ్యాంకు నుంచి కోట్లాది రూపాయల దొంగ రుణాలు మంజూరు అయ్యాయి. అలా దొంగ రుణాలు ఇప్పించినందుకు సిపిఎం నాయకులు భారీ మొత్తాల్లో కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో సిపిఎం త్రిశూర్ జిల్లా కార్యదర్శులుగా ఎసి మొయిద్దీన్, ఎంఎం వర్గీస్, కె రాధాకృష్ణన్ ఉండేవారు.
ఆ కేసుకు సంబంధించి మొయిద్దీన్, వర్గీస్‌లను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. ఇప్పుడు మొట్టమొదటిసారి ఎంపీ రాధాకృష్ణన్‌ను విచారణ చేయడానికి సమన్లు జారీ చేసింది. బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకూ సీపీఎం స్థానిక నాయకులు, బ్యాంకు సిబ్బందితో కలిపి మొత్తం 53మంది నిందితులను ఈడీ గుర్తించింది. ఇప్పటివరకూ 143 కోట్ల నగదు జప్తు చేసింది. తుది చార్జిషీటులో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎంపీకి సమన్లు జారీ చేసారని సిపిఎం మండిపడింది.