చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్త వెంకట రమణ హత్య చేశాడని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాకు తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ కబ్జాలపై రామకృష్ణ పోరాటం చేశాడని, దీంతో వైసీపీ కార్యకర్తలు కక్ష పెంచుకున్నారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా ఈ హత్యలో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు రెడ్డప్పరెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. హత్యకు ముందు నిందితులు అనేక సార్లు రెడ్డప్పరెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు ఎస్పీ చెప్పారు.
కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ, వైసీపీ నేతల అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దీంతో వైసీపీ కార్యకర్తలు కక్ష పెంచుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రామకృష్ణ ఇంటి ముందు సంబరాలు చేసుకున్నాడు. కక్షకట్టిన వైసీపీ కార్యకర్త వెంకటరమణ బైకుతో రామకృష్ణ భార్యను ఢీకొట్టి గాయపరిచాడని, దీనిపై ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ గుర్తుచేశారు. ఇటీవల మట్టి లారీ ఇంటి ముందు తిరగడాన్ని రామకృష్ణ ప్రశ్నించాడని వెంకట రమణ, రెడ్డెప్పరెడ్డి కక్ష కట్టారని ఎస్పీ గుర్తుచేశారు.
రామకృష్ణ కుమారుడు సురేశ్‌ను హత్య చేసేందుకు వెంకట రమణ వేటకొడవలి సిద్దం చేసుకున్నాడని, అయితే సురేశ్ రాకపోవడంతో రామకృష్ణను హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. హత్య తరవాత ఏ1 వెంకట రమణను, ఏ5 రెడ్డప్పరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ కేసులో పుంగనూరు సీఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేశారు. నిందితుల అవినీతి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.