విశాఖలో లులు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరినట్లు కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు స్థలం కేటాయించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లులు వెనక్కి వెళ్ళింది.
కూటమి అధికారంలోకి రావడంతో ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో మళ్లీ ఏపీకి వచ్చేందుకు లులు గ్రూపు అంగీకరించింది. విశాఖలో మాల్ ప్రతిపాదనకు లులు గ్రూప్ సమ్మతి తెలపగా ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమ్మతి తెలిపింది.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రివర్గం సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రధానిని అమరావతికి ఆహ్వానించేందుకు నేటి సాయంత్రం దిల్లీకి సీఎం వెళ్ళనున్నారు.
హస్తిన పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు.
రాజధాని అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. ఐదు ప్రాంతీయ కేంద్రాల్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు కానుండగా వీటిని ‘హబ్ అండ్ స్పోక్’ విధానంలో ఏర్పాటు చేస్తారు. అమరావతిలో ఏర్పాటు చేసే ప్రధాన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌గా విడుదల చేయనుంది.
విద్యారంగంపై మంత్రివర్గ సమావేశంలో సమాలోచనలు చేశారు. ఉపాధ్యాయుల బదిలీల్ని ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ఉపాధ్యాయుల పనితీరు ఆధారంగా బదిలీలు విధానం అమలు చేసే ఎలా ఉంటుందనే విషయంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల మూడు తరగతులకు కలిపి ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నారని అందువల్ల పనితీరు ఆధారంగా బదిలీలు సాధ్యం కాదని మంత్రి లోకేశ్ అన్నట్లు చర్చ జరుగుతోంది.
సౌర ఫలకాల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు కోసం ఇండోసోల్ సంస్థకి అనుమతివ్వడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రంలోను, దేశంలోని ఇతర ప్రాంతాల్లోను భారీ ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటవుతున్నందున రాబోయే రోజుల్లో సౌర ఫలకాలకు చాలా డిమాండ్ ఉంటుందని ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులకు వివరించారు.
స్టార్టప్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపగా విద్యార్థులు ప్రారంభించే స్టార్టప్ సంస్థల్ని ప్రోత్సహించేందుకు నిధులు సమకూర్చాలని మంత్రివర్గం నిర్ణయించింది.
స్టార్టప్‌ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు సాయం అందించనున్నారు.
తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తాడిగడపకు, వైఎస్సార్‌కు ఏం సంబంధం లేనందున ఆ మున్సిపాలిటికి పెట్టిన వైఎస్సార్ పేరును తొలగించారు. ఇక నుంచి తాడిగడప మున్సిపాలిటీగా పిలవాలనే తీర్మానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కడప అస్థిత్వాన్ని కాపాడేలా వైఎస్సార్ జిల్లాను ఇకపై వైఎస్సార్ కడప జిల్లాగానే వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.