రాష్ట్రం యూనిట్‌గా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని భావించారు. అయితే విభజన తరవాత కొన్ని జిల్లాల్లో ఎస్సీల జనాభా వివరాలు సరిగా లేవు. దీంతో రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయించారు. 2026 జనాభా లెక్కల తరవాత జిల్లా యూనిట్‌గా ఎస్సీల రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.
ఎస్సీల వర్గీకరణను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో రెల్లి, ఉప కులాలకు 1 శాతం, బీలో మాదిగ, ఉప కులాలకు 6.5 శాతం, సీలో మాల, ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
విద్య, ఉద్యోగ నియామకాల్లో కమిషన్ 200 రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది. కమిషన్ నివేదిక అధ్యయనానికి మంత్రుల సంఘాన్ని వేశారు. మంత్రివర్గ సంఘం ప్రతిపాదనలు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదించింది.
రాష్ట్ర క్యాబినెట్‌లో ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. హో మంత్రి అనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. డీఎస్సీ మెగా నోటిఫికేషన్ విడుదల, ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల విడుదలలో జాప్యం వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్రస్తుతానికి జిల్లాలు యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ అమలు సాధ్యం కాదని, జనాభా లెక్కలు తేలే సరికి 2 సంవత్సరాలు పడుతుందని నిర్ణయానికి వచ్చారు. అప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్లు వాయిదా వేయడం సాధ్యం కాదు, కాబట్టి రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. రెల్లి ఉప కులాలైన బేడ, బుడగ జంగాలకు 1 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. అసెంబ్లీలో 20వ తేదీ దీనిపై విస్తృతంగా చర్చించి, అదే రోజు జాతీయ ఎస్సీ కమిషన్‌ను నివేదించనున్నారు. ఆ తరవాత ఆర్డినెన్స్ జారీ చేస్తారు.
జిల్లా యూనిట్‌గా పరిగణించాలని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. ఎమ్మెల్యే అభిప్రాయాలను టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సేకరించారు. జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేయాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ సమావేశం తరవాత ఎస్సీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు. వర్గీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మీడియాతో చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి రాగానే వర్గీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాజీవ్ మిశ్ర కమిషన్ నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిషన్, 4 వేల మంది అభిప్రాయాలను తీసుకుంది. మాల, మాదిగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంది. గతంలో వేసిన రామచంద్ర కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ కమిషన్ వల్ల మాదిగ, ఉప కులాలకు 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి.
మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి తెర పడేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మాదిగలు, ఉప కులాలు, ఆది ఆంధ్రా మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయడం హర్షనీయమన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు సరైన న్యాయం జరుగుతుందని మరో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. పీ4 అమల్లోకి వస్తే మాదిగ, మాల వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయన్నారు.
ఎంఆర్పీఎస్ ఉద్యమకారుడు మంద కృష్ణమాదిగ అలుపెరగని పోరాటం, ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది. తెలంగాణ, ఏపీలో ఎస్సీలు మాదిగ, మాలలకు కలిపి రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని 1991లో మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమం మూడు దశాబ్దాలుపైగా సాగింది. చివరకు తెలంగాణ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు, సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణకు అడ్డంకులు తొలిగిపోయాయి. మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి రానుంది.