పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పా పెట్టకుండా మాయమైపోయారు. ఆయన వియత్నాం వెళ్ళారని తర్వాత తెలిసింది. ప్రతీ చిన్న విషయం గురించీ గొంతెత్తి చించుకునే రాహుల్ గాంధీ ఇలా అకస్మాత్తుగా దేశంలో మాయమైపోవడం, ఏదో విదేశానికి వెళ్ళారని తర్వాత తెలియడం సర్వ సాధారణమైపోయింది. ఇటీవల ఆయన ఎక్కువగా వియత్నాం దేశానికి వెడుతున్నారు. ఆ దేశంలో రాహుల్ గాంధీకి పని ఏముంటుంది అన్న అనుమానాలకు ఆయన కానీ, ఆయన పార్టీ కానీ జవాబివ్వడం లేదు.
ఆ విషయాన్నే ప్రస్తావించారు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్. ‘‘వియత్నాంలో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకున్నారు సరే… హోలీ కూడా వియత్నాంలోనేనా? రాహుల్ గాంధీ ఈ యేడాది ఇప్పటికే వియత్నాంలో 22 రోజులు గడిపారు. ఆయన అంత సమయం తన సొంత నియోజకవర్గం రాయబరేలీలో అయినా గడపలేదు’’ అని ఆశ్చర్యపోయారు. వియత్నాం పట్ల రాహుల్ గాంధీ అసాధారణ అభిమానం పట్ల రవిశంకర్ ప్రసాద్ అనుమానాలు వ్యక్తం చేసారు కూడా. ఇంతకీ, రాహుల్ గాంధీకి వియత్నాంలో అంత ఆకర్షణ ఏముంది?
వియత్నాం దేశం చైనా సరిహద్దులో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే వియత్నాంలో రాహుల్ తరచూ పర్యటనలు చేస్తున్నారు అంటే కచ్చితంగా అది జాతీయ భద్రతకు ప్రమాదకరంగా నిలిచే అవకాశముందని అమిత్ మాలవీయ అనుమానించారు. బీజేపీ ఐటీసెల్ ప్రధాన నేత అయిన అమిత్ మాలవీయ, రాహుల్ గాంధీ తరచుగా చేస్తున్న విదేశీ పర్యటనలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయా? అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. విదేశాలకు ఆయన చాలా తరచుగా రహస్యంగా వెళ్ళి వస్తుండడం, ప్రతీసారీ ఆయన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో వెళ్ళిపోవడం, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కాగలదన్న అనుమానాలు కలగజేస్తోంది’’ అంటూ అమిత్ మాలవీయ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ తాజా వియత్నాం పర్యటన గురించి ప్రజలందరికీ తెలుసు. ఆయన చివరిసారిగా గతేడాది డిసెంబర్ 26న మన్మోహన్ సింగ్ మరణించిన సమయంలో వియత్నాం వెళ్ళారు. యావత్ దేశం మాజీ ప్రధాని మరణించిన బాధలో ఉండగానే రాహుల్ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోడానికి విదేశాలకు వెళ్ళిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మన్మోహన్ సింగ్ మరణం మీద రాహుల్ గాంధీ రాజకీయాలు చేసారు, కానీ మన్మోహన్‌జీ పట్ల రాహుల్ లెక్కలేనితనం ఎవరికి తెలియనిది? అంటూ అమిత్ మాలవీయ మండిపడ్డారు.
రాహుల్ గాంధీ ఎక్కడకు వెళ్ళినా ఫొటోలు, వీడియోలు షేర్ చేసే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ వియత్నాం పర్యటనను మాత్రం రహస్యంగా ఉంచింది. బీజేపీ మాత్రం రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులతోనూ, భారత్‌ను అస్థిరపరిచే కుట్రలతో పనిచేస్తున్న మీడియా సంస్థలతోనూ చేతులు కలిపారని తీవ్రమైన ఆరోపణలు చేసింది.
తమ ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాలను బీజేపీ నేత సంబిత్ పాత్రా చూపించారు కూడా. గత డిసెంబర్ 5న ఫ్రెంచ్ మీడియా సంస్థ ‘మీడియాపార్ట్’ ప్రచురించిన నివేదికను ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దాని ప్రకారం, ప్రపంచ కుబేరుడు జార్జి సొరోస్, అమెరికా కేంద్రంగా పనిచేసే సంస్థలు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్‌పీ) అనే ప్రమాదకర త్రయంతో రాహుల్ గాంధీ కలిసి పనిచేస్తున్నారని, వారి లక్ష్యం మన దేశంలో అస్థిరతను పెంచి పోషించడమేననీ ఆ నివేదిక స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ ఇప్పుడు సుదీర్ఘమైన వియత్నాం పర్యటన ఎందుకు పెట్టుకున్నారు. రాక్‌ఫెల్లర్, జేపీ మోర్గాన్, బోయింగ్ వంటి అమెరికా డీప్‌స్టేట్‌కు సంబంధించిన కంపెనీల ఉన్నతస్థాయి అధికారులు ఈ వారమే వియత్నాంలో పర్యటిస్తున్నారు. వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి టో లామ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమవడానికి అమెరికాకు చెందిన 60కి పైగా పెద్ద కంపెనీల ప్రతినిధులు వియత్నాం వెడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా అక్కడికి వెళ్ళారు.
ఇంక వియత్నాంలో జార్జి సొరోస్‌కు పెద్ద పట్టే ఉంది. ఆ దేశంలోని ఫుల్‌బ్రైట్ యూనివర్సిటీ… సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ యూనివర్సిటీ నెట్‌వర్క్‌లో ఒక భాగం. ఇంక వియత్నాంలో సొరోస్ నిధులు సమకూరుస్తున్న స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నాయి. గత సెప్టెంబర్‌లో ఫుల్‌బ్రైట్ వర్సిటీ, సొరోస్ ప్రాయోజిత స్వచ్ఛంద సంస్థలూ కలిసి వియత్నాంలో తిరుగుబాటుకు ప్రయత్నించాయన్న వార్తలు వ్యాపించాయి. యూనివర్సిటీ ఆ వార్తలను సహజంగానే తిరస్కరించింది.
డొనాల్డ్ ట్రంప్ గత నెల ఒక సందర్భంలో మాట్లాడుతూ బైడెన్ ప్రభుత్వం భారతదేశపు ఎన్నికల్లో ఓటర్లు ఓటువేసేలా ప్రభావితం చేయడానికి 2.1కోట్ల డాలర్ల నిధులు సమకూర్చిందన్న వాస్తవాన్ని బైటపెట్టారు. జార్జి సొరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సలీల్ శెట్టి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రత్యక్షంగానే పాలు పంచుకున్నారు. సొరోస్ సంస్థలకూ కాంగ్రెస్ నాయకత్వానికీ మధ్య స్నేహం పెరుగుతుండడం పలు అనుమానాలకు తావిచ్చింది. సలీల్ శెట్టి ప్రపంచ ప్రజాస్వామ్యాలు, మానవ హక్కులు వంటి విషయాల గురించి వాదిస్తూంటారు. అయితే అతని వాదనలు భారతదేశపు జాతీయ ప్రయోజనాలకు భిన్నంగా ఉంటాయి.
ఈ కూటమిలో అత్యంత సమస్యాత్మకమైన కోణం నేరుగా జార్జి సొరోస్ ప్రమేయమే. భారతదేశపు ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండాలన్న విషయాన్ని సొరోస్ స్వయంగా నిర్ణయిస్తున్నారు. జార్జి సొరోస్ ప్రపంచ కుబేరుడు, పెట్టుబడిదారు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. భారత్‌లో తమమాట వినడంలేని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి వందల కోట్లు ఖర్చు పెట్టారన్నఆరోపణలు ఉన్నాయి. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే సొరోస్‌కు సంబంధించిన సంస్థ పలు దేశాల్లో రాజకీయ ఫలితాలను ప్రభావితం చేసే రకరకాల ప్రయత్నాలకు భారీగా నిధులు కుమ్మరిస్తూ ఉంటుంది. దానికి భారతదేశమూ మినహాయింపు కాదు.
భారతీయ కోటీశ్వరుడు, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మీద రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి వెనుక జార్జి సొరోస్ హస్తముంది. సొరోస్‌కూ కాంగ్రెస్ పార్టీకీ ఉన్న గాఢమైన అనుబంధం గురించి ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ చెప్పారు. ‘జార్జి సొరోస్ చిరకాల మిత్రుడు’ అని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.