పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాబోయే శ్రీరామనవమి నాడు, అంటే ఏప్రిల్ 6న సుమారు రెండు వేల శోభాయాత్రలు జరుగుతాయని, వాటిలో కోటిమందికి పైగా హిందువులు పాల్గొంటారనీ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి చెప్పారు.
పూర్వ మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్ నియోజకవర్గంలో మూడు రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, శోభాయాత్రల కోసం అధికారిక అనుమతులు తీసుకోవద్దని సూచించారు. ‘భగవాన్ శ్రీరాముడిని పూజించుకోడానికి మనం అనుమతులు తీసుకోవలసిన అవసరం లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. గతేడాది శ్రీరామనవమి శోభాయాత్రల్లో సుమారు 5లక్షల మంది పాల్గొన్నారు. ఈ యేడాది రాష్ట్రవ్యాప్తంగా 2వేల శోభాయాత్రల్లో కోటిమందికి తక్కువ కాకుండా హిందువులు పాల్గొంటారు’’ అని ధీమా వ్యక్తం చేసారు.
పశ్చిమబెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారి, ఆ శోభాయాత్రలు శాంతియుతంగా సాగుతాయని హామీ ఇచ్చారు. ‘ఎదుటి పక్షం కూడా శాంతియుతంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకులది’ అని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గంలోని సోనాచూరా ప్రాంతంలో ఈ యేడాది చివరికల్లా ఒక రామ మందిరం నిర్మిస్తామని ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గతేడాది శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలకు మంచి స్పందన లభించింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహించిన యాత్రలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హూగ్లీ, హౌరా వంటి జిల్లాల్లో అయితే రామనవమి శోభాయాత్రలకు అపూర్వమైన ప్రజాస్పందన లభించింది. రామనామ సంకీర్తనలు, భజనలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. భారీ స్థాయిలో ప్రజలు గుమిగూడిన చోట భద్రత పెంచారు. శోభాయాత్రల నిర్వాహకులతో స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేసి, కార్యక్రమాలు సజావుగా సాగేలా చూసారు. ఇంక శోభాయాత్రల్లో పాల్గొన్న సాధారణ ప్రజలు, రామభక్తులు నియమ నిబంధనలకు లోబడి ఉండి, శాంతిపూర్వక వాతావరణం చెదరకుండా చక్కటి ఆధ్యాత్మిక భావనలతో యాత్రను పూర్తి చేసుకున్నారు.