భారతదేశాన్ని హిందూదేశంగా చేయాలన్నది తన నిర్ణయమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే టి రాజాసింగ్ స్పష్టం చేసారు. మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేసారు.
మహారాష్ట్రలోని పుణేలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, రాజాసింగ్ ‘‘ఔరంగజేబు సమాధిని తమ రాష్ట్రంలో ఉండకూడదని మహారాష్ట్రలోని హిందువులు కోరుకుంటున్నారు. ఎప్పుడు కూలుతుంది ఔరంగజేబు సమాధి? నాకిప్పుడు ఒకటే కోరిక ఉంది. భారతదేశాన్ని హిందూదేశంగా చేయాలి, ఔరంగజేబు సమాధిని తొలగించాలి’’ అన్నారు.
అసలు ఔరంగజేబు సమాధి ఇంకా ఎందుకు ఇక్కడుంది అని మహారాష్ట్రలోని హిందువులే కాదు, దేశంలోని హిందువులు అందరూ అడుగుతున్నారు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ‘‘ఔరంగజేబు తన తండ్రిని ఖైదు చేసాడు, సోదరులను చంపించేసాడు, మన దేవాలయాలను నాశనం చేసాడు. మహారాష్ట్రలో అతని సమాధి విషం పూసిన కత్తిలా ఉంది’’ అన్నారు.
అంతకుముందు, ఔరంగజేబు సమాధిని తొలగించడానికి కరసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలను రాజాసింగ్ ప్రశంసించారు. ‘‘మన బజరంగ్ దళ్, విహెచ్‌పి కార్యకర్తలు ఒక అద్భుతమైన ప్రకటన చేసారు. ఔరంగజేబు సమాధిని ప్రభుత్వం పడగొట్టలేకపోతే, అక్కడ మేమే కరసేవ చేస్తామని చెప్పారు. దాన్ని నేను పూర్తిగా సమర్ధిస్తున్నాను’’ అని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
అంతకుముందు బజరంగ్ దళ్ నాయకుడు నితిన్ మహాజన్ మాట్లాడుతూ శంభాజీనగర్ జిల్లాలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఆ పని చేయలేకపోతే ఆ సమాధికి బాబ్రీ మసీదుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ‘‘దాని ఉనికి గురించి హిందూ సమాజం ఉద్యమం చేస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు. అయోధ్యలో ఏం జరిగిందో మనందరం చూసాం. ఆ సమాధిని ప్రభుత్వం తొలగించకపోతే మేమే కరసేవ చేస్తాం, ఆ సమాధిని మేమే తొలగిస్తాం’’ అన్నారు.
ఆ వ్యవహారం మీద కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ స్పందిస్తూ మహారాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా బతకాలని బజరంగ్ దళ్, విహెచ్‌పి అనుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘వాళ్ళకి ఇంక వేరే పనేమీ లేదు. మహారాష్ట్ర ప్రజలు శాంతియుతంగా జీవించాలని వారు భావించడం లేదు. రాష్ట్రం అభివృద్ధి వేగాన్ని వారు నిలువరించాలని కోరుకుంటున్నారు. ఔరంగజేబు ఇక్కడ 27ఏళ్ళు ఉన్నాడు. అయినా మహారాష్ట్రను ఏమీ చేయలేకపోయాడు. అలాంటి వ్యక్తి సమాధిని తొలగించి ఏం సాధిద్దామనుకుంటున్నారు?’’ అని వడెట్టివార్ ప్రశ్నించారు.
మహారాష్ట్రలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయిందనీ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనమైపోయాయనీ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అతుల్ లోంధే పాటిల్ అన్నారు.