తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఈవో ప్రకటించారు. సోమ, మంగళవారం దర్శనాలకు ఆదివారం, సోమవారం సిఫార్సు లేఖలను స్వీకరిస్తారు. గురువారం నాడు రూ.300 టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ఏ రోజు లేఖలు ఆరోజే అనుమతిస్తారు. ఒక సిఫార్సు లేఖకు ఆరుగురిని అనుమతిస్తారు. ఇది మార్చి 24 నుంచి అమల్లోకి వస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఇప్పటి వరకు ఆదివారం నాడు లేఖలు తీసుకుంటున్నారు. ఇక నుంచి శనివారమే లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది. భక్తుల రద్దీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.