ఆంధ్రప్రదేశ్ భూమి, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 1971 సవరణ బిల్లుకు ఇవాళ శాసనమండలి ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే శాసనసభ ఆమోదం లభించినందున ఆ బిల్లు ఇకపై చట్టంగా మారింది. కొత్త చట్టం ప్రకారం… భూముల వివాదాలకు సంబంధించి అప్పిలేట్ అధారిటీగా డీఆర్‌ఒ బదులు ఇకపై ఆర్‌డీఓ వ్యవహరిస్తారు.
పట్టాదారు పాసుపుస్తకాల చట్టం సవరణ బిల్లుకు శాసనసభలో గురువారమే ఆమోదం లభించింది. మండలిలో ఆమోదం కోసం ఆ బిల్లును రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ ప్రవేశపెట్టారు.
నిజానికి భూముల వివాదాలకు అప్పిలేట్ అధారిటిగా గతంలో ఆర్డీవోయే ఉండేవారు. 2022లో చట్ట సవరణ చేసి ఆ అధికారాన్ని డీఆర్‌ఓను నియమించారు. ఐతే డీఆర్‌ఓలకు పనిభారం ఎక్కువగా ఉన్నందున అప్పీళ్ళ పరిష్కారంలో ఆలస్యం ఎక్కువ అవుతోంది. ఒక్కో అప్పీలు పరిష్కారానికి డీఆర్వోలకు ఆరేసి నెలల సమయం పడుతోంది. ఇప్పటి వరకూ 4వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అందుకే అప్పిలేట్ అథారిటీ బాధ్యతలను మళ్ళీ ఆర్‌డీఓలకు అప్పగిస్తున్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేసారు. ఆర్‌డీఓలే ప్రజలకు మరింత చేరువగా ఉంటారనీ, వారు అప్పీళ్ళను మూడు నెలల వ్యవధిలోనే పరిష్కరిస్తారనీ మంత్రి చెప్పుకొచ్చారు. డీఆర్‌ఓల కంటె ఆర్‌డీఓల దగ్గరకు దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వస్తాయని వివరించారు.