పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకూ 19వేల 396 కోట్లు ఖర్చు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. శాసనమండలిలో సభ్యులు పోలవరం ప్రాజెక్టు గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు.
పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ 17వేల 860 కోట్లు చెల్లించిందని తెలియజేసారు. ప్రాజెక్టు వల్ల 86,660 కుటుంబాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నిర్వాసితులకు మొదటి దశలో రూ.1203 కోట్లు చెల్లించామని చెప్పారు. ఇంకా 18,266 కుటుంబాలకు రూ.1340 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు.
ఇప్పటివరకూ సుమారు 13వేల నిర్వాసితుల కుటుంబాలను తరలించామనీ, ఇంకా 27వేలకు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉందనీ చెప్పారు. నిర్వాసితుల కోసం మొత్తం 75 కాలనీలు కడతామని, వాటిలో 49 నిర్మాణంలో ఉన్నాయనీ రామానాయుడు చెప్పారు. మిగతా కాలనీల నిర్మాణం గత టీడీపీ హయాంలోనే పూర్తయిందని, వైఎస్ఆర్‌సిపి పాలనా కాలంలో ఒక్క ఇంటికైనా పునాది వేయలేదన్నారు. 49 కాలనీల నిర్మాణానికి టెండర్లు కొత్తగా పిలుస్తామని చెప్పారు. ఆ కాలనీల నిర్మాణం 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని వివరించారు.
పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించింది జగన్ ప్రభుత్వమేననీ, దానికి కారణమేమిటో ఆయననే అడగాలనీ రామానాయుడు అన్నారు.