ఆదివారం మార్చి 16న బలోచిస్తాన్‌లోని నోష్కి జిల్లాలో తాము చేసిన ఆత్మాహుతి దాడిలో, కనీసం 90మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. తమ సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో ఒక బస్సు పూర్తిగా తగులబడిపోయిందని బీఎల్ఏ వెల్లడించింది. దాన్ని వాహన ఆధారిత ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌తో (వీబీఐఈడీ) పేల్చేసామని ప్రకటించారు.
తమ సంస్థకు చెందిన మజీద్ బ్రిగేడ్ పాక్ సైన్యం ప్రయాణిస్తున్న 8 వాహనాల శ్రేణి మీద ఆత్మాహుతి దాడి చేసిందని బిఎల్ఎ అధికార ప్రతినిధి జీయాంద్ బలోచ్ ప్రకటించారు. ఆర్‌సిడి హైవే మీద రక్షణ్ మిల్ దగ్గర తాము చేసిన ఆత్మాహుతి దాడిలో ఒక బస్సు పూర్తిగా ధ్వంసమైందని స్పష్టం చేసారు. తమ సంస్థకే చెందిన ఫతే స్క్వాడ్ మరో బస్సులో ఉన్న పాక్ సైనికులు అందరినీ మట్టుపెట్టిందని వెల్లడించారు. ‘‘కాన్వాయ్‌లో 8 బస్సులున్నాయి. పేలుడులో ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. దాడి చేసిన వెంటనే బిఎల్ఎకు చెందిన ఫతే స్క్వాడ్ వెంటనే మరో బస్సును చుట్టుముట్టింది. అందులో ఉన్న పాక్ సైనికులు అందరినీ మట్టుపెట్టింది. దాంతో చనిపోయిన శత్రువుల సంఖ్య 90కి చేరింది’’ అని జీయాంద్ బలోచ్ తన ప్రకటనలో స్పష్టం చేసారు.
పాకిస్తాన్ అధికారులు దాడిని ధ్రువీకరించారు. కానీ 12మంది సైనికులు మాత్రమే చనిపోయారని, మరో 35 మందికి గాయాలయ్యాయనీ వెల్లడించారు. నోష్కి సిటీ పోలీస్ స్టేషన్ అధికారి స్థానిక మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం… మిలటరీ కాన్వాయ్ క్వెట్టా నుంచి నోకుండీ వెడుతుండగా తఫ్తాన్ దగ్గర దాడి జరిగింది. పేలుడులో ఒక బస్సు పూర్తిగా నాశనమైపోయింది. తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్లలో నోష్కి, క్వెట్టా ఆస్పత్రులకు తరలించారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతం మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకున్నాయి. నిజానికి మొదట్లో ఏడుగురు మాత్రమే చనిపోయారని, 35మంది గాయపడ్డారనీ, వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందనీ సమాచారం ఇచ్చారు. తర్వాత మృతుల సంఖ్యను 12కు పెంచారు.
బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడిని పాకిస్తాన్ హోంమంత్రి మొహిసిన్ నక్వీ, బలోచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరోజ్ బుగ్తీ తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితిలోనూ బలోచిస్తాన్‌లో శాంతిని స్థాపిస్తామని ప్రకటించారు.
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ కొడుకు బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ బలోచిస్తాన్‌లో అధికారంలో ఉంది. అందువల్లనే ఆ ప్రాంతంలో ఇటీవల హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నా పాకిస్తాన్ ప్రభుత్వం బలోచిస్తాన్‌లోని రాష్ట్ర ప్రభుత్వం మీద నోరు మెదపడం లేదు. బలోచిస్తాన్ పక్కనే ఉన్న ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రొవిన్స్‌లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ అధికారంలో ఉంది. అందువల్లనే అక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సాయుధ తిరుగుబాటుదారుల సంస్థ హింసకు పాల్పడినప్పుడల్లా ఆ ప్రొవిన్స్ ముఖ్యమంత్రి అమన్ అలీ గండాపూర్ మీద పాకిస్తాన్ ప్రభుత్వం విరుచుకుపడిపోతూ ఉంటుంది.