తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలిందంటూ ఆదివారం వ్యాపించిన వార్తలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరా తీశారు. డయేరియా నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలనీ, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలనీ ఆదేశించారు. డయేరియా ప్రబలిన దాదాపు పది గ్రామాలలో 20 వైద్య బృందాలను ఏర్పాటు చేసామని అధికారులు సీఎంకు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎటువంటి ప్రమాదం లేదనీ అధికారులు వివరించారు.
మరోవైపు, ధర్మవరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గోపాలపురంలో డయేరియాపై స్పెషల్ సియస్ కృష్ణబాబుతోనూ, ఇతర ఉన్నతాధికారులతోనూ ఫోన్‌లో మాట్లాడారు. డయేరియా నివారణకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.
డయేరియా ప్రబలిన గ్రామాలలో రాష్ట్రప్రభుత్వం వైద్య బృందాలను ఏర్పాటు చేసిందని కార్యదర్శి కృష్ణబాబు మంత్రికి వివరించారు. అవసరమైతే మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యాన్ని అందించాలని మంత్రి సూచించారు. బాధిత గ్రామాల్లో ఇంటింటి సర్వే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందనీ, ఆందోళన అవసరం లేదనీ మంత్రికి ఉన్నతాధికారులు వివరించారు.