ఆంధ్రప్రదేశ్‌లో వేసవి మంటలు మొదలైపోయాయి. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు, ఇవాళ 200కు పైగా మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ చెప్పిన వివరాల ప్రకారం ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురం మన్యం జిల్లాలో 12… మొత్తం 35 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
అలాగే శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం జిల్లాలో 10, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 2, అనకాపల్లి జిల్లాలో 16, కాకినాడ జిల్లాలో 15, కోనసీమ జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ఏలూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 10, ఎన్టీఆర్ జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 14, బాపట్ల జిల్లాలో 1, పల్నాడు జిల్లాలో 19… మొత్తం 167 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపుతాయని వివరించారు.
మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. 25 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 89 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.