పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల అనుమతించారు. ఆ నేపథ్యంలో నేటి నుంచీ పార్లమెంటు క్యాంటీన్‌లో రెండు చోట్ల అరకు కాఫీ స్టాల్స్‌ను తాత్కాలికంగా ప్రారంభిస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ ఏపీజీసీసీ అధికారులు వెల్లడించారు.
జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగానూ మంచిపేరు గడించిన అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు గిరిజన సహకార సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే భారత పార్లమెంటులో కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రులకు కానుకగా ఇచ్చేందుకు ప్రత్యేకంగా అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌లను సైతం సిద్ధం చేసారు. వాటిని వీలైనంత వరకూ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రివర్గ సభ్యులు అందరికీ అందజేయాలని జీసీసీ అధికారులు భావిస్తున్నారు.
ఇక అమరావతిలో కూడా ఈ నెల 28 వరకూ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల ఒకటి రెండు రోజుల్లో అక్కడ కూడా అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణితో జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి చర్చలు జరిపారు.