ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ఇవాళ్టి నుంచి మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. నేటి నుంచి ఏప్రిల్ 1 వరకూ పరీక్షలు జరుగుతాయి. చివరి పరీక్షను రంజాన్ సెలవును బట్టి మార్చి 31 లేదా ఏప్రిల్ 1ల్లో ఏదో ఒక రోజు నిర్వహిస్తారు.
ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 6,49,884 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్ధులు 6,19,275 మంది ఉన్నారు. ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్న వారు 30,609 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్ధుల్లో 5,64,064 మంది ఆంగ్ల మాధ్యమంలోనూ, 51,069 మంది తెలుగు మాధ్యమంలోనూ పరీక్షలు రాయనున్నారు. ఉర్దూలో పరీక్షలు రాసేందుకు 2471మంది, హిందీలో పరీక్షలు రాసేందుకు 16మంది, కన్నడలో రాసేందుకు 623మంది, తమిళంలో రాసేందుకు 194మంది, ఒడియాలో రాసేందుకు 838మంది విద్యార్ధులు సిద్ధమయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 3450 పరీక్షా కేంద్రాలను ఈ పరీక్షల కోసం ఎంపిక చేసారు. వాటిలో 163 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పరీక్షల నిర్వహణను సీసీటీవీల్లో పర్యవేక్షిస్తారు.