మొదటి భాగం తరువాత…
రెండో భాగం తరువాయి…
కాశినాయన ఆశ్రమం వివాదంలో పవన్ ఎక్కడ?
2025 మార్చి మొదటివారంలో అటవీశాఖ అధికారులు కడపజిల్లాలోని నల్లమల అటవీప్రాంతంలో ఉన్న కాశినాయన జ్యోతిక్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేసారు. ఆ ప్రాంతం టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందనీ, అక్కడ భవనాలు ఉండడం అటవీ చట్టాల ఉల్లంఘన అనీ చెబుతూ అన్నదాన సత్రం భవనాలను కూల్చివేసారు. ఆ కూల్చివేతలు కూడా ఒక్కరోజులో జరిగినవి కావు. విచిత్రమేంటంటే ఆ కూల్చివేతలు జరిపించిన అటవీశాఖకు మంత్రి పవన్ కళ్యాణే. పార్టీ వ్యవస్థాపక దినం కార్యక్రమాల్లో హడావుడిగా ఉన్నందునో ఏమో, పవన్ కళ్యాణ్‌కు ఈ సంఘటన గురించి స్పందించే తీరిక లేకపోయినట్లుంది.
రాయలసీమ ప్రాంతంలో ఆరాధనీయుడైన అవధూత కాశినాయన. కొంతమంది సాధువులు, బాబాల్లా ఆయనపై ఎలాంటి ఆరోపణలూ లేవు. ఆయన తన జీవితాంతం చేసిన బోధ ఒక్కటే. ఆగొన్నవారికి ఆహారం పెట్టండి అని మాత్రమే. ఆ మాట మీద గురి కుదిరిన దాతలు నడిపిస్తున్న అన్నదాన ఆశ్రమాలు నల్లమల అటవీ ప్రాంతంలో చాలా ఉన్నాయి. లక్షలాది భక్తులకు, నిరుపేదలకు, యాత్రికులకు ఆహారం పెట్టే కేంద్రాలు ఆ ఆశ్రమాలు. వాటిని హడావుడిగా కూల్పించేయడం వెనుక రాజకీయ హస్తాలు ఉన్నాయని కొన్ని పుకార్లు కూడా వినవచ్చాయి. వాటిలోని నిజానిజాలు ఎలా ఉన్నా.. అక్కడ కూడా హిందువులకే అన్యాయం జరిగింది.
అదే నల్లమల అటవీ ప్రాంతంలో అన్యమతస్తుల అక్రమ నిర్మాణాల జోలికి అటవీశాఖ అధికారులు వెళ్ళలేదు. కడప జిల్లా కనుమ లోయపల్లి దగ్గర పాలకొండ రక్షితారణ్యంలో మసీదును అక్రమంగా నిర్మించారు. ఆ మసీదు కోసం అక్రమంగా సిమెంట్ రోడ్ వేసారు. దానికి విద్యుత్ కనెక్షన్ ఎలా ఇచ్చారు, ఆ మసీదుపై అటవీ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు…. అని హిందూ సమాజం ప్రశ్నిస్తోంది. సిద్ధవటం మండలం భాకరాపేట దగ్గర వందల యెకరాలు ఆక్రమించి క్రైస్తవ చర్చిని భారీస్థాయిలో నిర్మించారు. అది అక్రమ నిర్మాణం కాదా? దాన్ని ఎందుకు కూల్చడం లేదు? అని హిందువులు నిలదీసి ప్రశ్నిస్తున్నారు. లౌకికవాదం ముసుగులో కేవలం హిందువుల మీదనే ప్రతాపం చూపించే ప్రభుత్వాలకు, అధికారులకు అన్యమతస్తుల అక్రమాలు కనిపించడం లేదా? చట్టాలు రాకముందు నుంచీ ఉన్న హిందూ క్షేత్రాలను కూల్చివేయడంలో చూపుతున్న అత్యుత్సాహం, కొద్దికాలం క్రితమే అక్రమంగా నిర్మించిన చర్చి మసీదులపై ఎందుకు చూపించడం లేదని దుయ్యబడుతున్నారు.
కొన్నాళ్ళ క్రితం ఏదో కేసు విషయంలో హోంమంత్రిని పవన్ కళ్యాణ్ నిలదీస్తూ అవసరమైతే తానే హోంమంత్రిగా పగ్గాలు చేపట్టాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. తిరుపతి లడ్డూ వివాదం సమయంలో క్షమాపణ చెప్పరెందుకు అంటూ టీటీడీ ఛైర్మన్‌ని నిలదీసారు. మంచిదే. అయితే కాశినాయన ఆశ్రమంలోని నిర్మాణాలను కూల్చివేసిన అటవీ శాఖ తన పరిధిలోనే ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఏం చేసారు? ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా ఒక నెటిజన్ ఈ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ సహచర మంత్రి, ముఖ్యమంత్రి తనయుడూ అయిన లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. దానికి లోకేష్ వెంటనే సానుకూలంగా స్పందించారు. కాశినాయన ఆశ్రమంలోని నిర్మాణాలను కూలగొట్టినందుకు తాను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు. ఆ నిర్మాణాలను తన సొంత డబ్బులతో మళ్ళీ కట్టింపజేస్తానని హామీ ఇచ్చారు. ఒక్కరోజులోనే ఆ పనులు మొదలయ్యాయి. ఆశ్రమానికి బస్సును పునరుద్ధరించారు. కూల్చివేసిన నిర్మాణాల స్థానంలో కొత్త నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. అదంతా బాగానే ఉంది. అలాంటి స్పందన, సంబంధిత శాఖ చూస్తున్న పవన్ కళ్యాణ్ నుంచి కరవైంది ఎందుకు?
ఉపముఖ్యమంత్రి హోదా విషయంలో పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య పోటీ గురించి కొన్ని రాజకీయ చర్చలు జరిగాయి. అంతెందుకు, చంద్రబాబు తర్వాత కాబోయే సీఎం తమ నాయకుడే అంటూ ఇరు పార్టీల కార్యకర్తలూ చెలరేగిపోయారు. సరే, అవి రాజకీయాలు. కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న అటవీశాఖ చేసిన పనికి లోకేష్ క్షమాపణలు చెప్పడం దేన్ని సూచిస్తోంది? రాజకీయంగా చూసినా సరే, లోకేష్‌కు అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఉంది కదా. అది కాకపోయినా, లోకేష్ స్పందన తరువాత అయినా సరే, పవన్ స్పందించాల్సి ఉంది కదా. ఎందుకు నోరెత్తలేదు?
ఈ వ్యవహారంపై బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు పురందరేశ్వరి, కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. అటవీ చట్టాల ఉల్లంఘన పేరుతో హిందువులకు ఆరాధనీయుడైన స్వామి ఆశ్రమంలోని నిర్మాణాలను పడగొట్టివేసిన సంగతిని వివరించారు. ఆశ్రమాన్ని పరిరక్షించాలని కోరారు. దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆశ్రమ పరిరక్షణకు తాము చేయగలిగినంతా చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా లేరు ఎందుకని? ఏం జరిగింది? మంత్రి స్థాయి వ్యక్తి స్పందించవలసినంత పెద్ద విషయం కాదని పవన్ ఏమైనా భావిస్తున్నారా? ఇది కూడా హిందూధర్మం మీద జరిగిన దాడే. అదే అటవీ ప్రాంతంలో ఉన్న అన్యమతస్తుల అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి అయినా చూడని అధికారులు లక్షల మంది పొట్ట నింపుతున్న అన్నదాన కేంద్రాలను పడగొడుతుంటే సంబంధిత మంత్రి హోదాలో ఆయన ఏం చేసారు?
పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి ఇంకా యేడాది నిండలేదు నిజమే. కానీ ఆయన పార్టీ పెట్టి పుష్కరం గడిచింది. రాజకీయాల్లోకి వచ్చి పదిహేనేళ్ళు కావస్తోంది. ఇన్నేళ్ళలో ఆయన వామపక్షాలతో, బీఎస్పీతో పొత్తులు పెట్టుకున్నారు. తెలుగుదేశంతో అనుబంధం కొనసాగిస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలిపారు. 2024 ఎన్నికల వేళ బీజేపీ-టీడీపీ మధ్య సంధి కుదిర్చిన ఘనత సాధించారు. అంటే సుమారు ఐదేళ్ళ నుంచీ నిలకడగా రైట్‌వింగ్ రాజకీయాల వైపే నిలబడి ఉన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడిగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఆవేశపూరితమైన ప్రసంగాలతో ప్రజల నాడిని పట్టుకున్నారు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చాక హిందూ ధర్మానికి కొంతయినా మేలు కలిగించే కార్యాచరణ చూపితే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ఎర్రకోట దాటి ప్రతిధ్వనిస్తాయి. ఆచరణ అమరావతి పరిధిలోనైనా కనిపిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.
(సమాప్తం)