జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలను, మాట్లాడిన తీరును పరిశీలిస్తే జాతీయవాదాన్నీ, హిందుత్వ వాదాన్నీ తలకెత్తుకున్న తీరు కనిపిస్తుంది. త్రిభాషా సూత్రం గురించి, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన గురించీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసాయి. బాల్‌ఠాక్రే కాలం నాటి శివసేనను వదిలేస్తే భాజపాయేతర రాజకీయ పక్షాల్లో హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాల గురించి ఇంత స్పష్టంగా మాట్లాడిన నాయకులు దేశంలో చాలా కొద్దిమందే. అందునా దక్షిణ భారతంలో ఎవరూ లేరనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ద్రవిడవాదం పేరిట దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న డీఎంకే ప్రబుద్ధులకు పవన్ కళ్యాణ్ దీటుగా జవాబివ్వడం అందరినీ ఆకర్షిస్తోంది. తప్పొప్పుల మాట ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రస్తావనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.
అయితే ఆ ఉత్సాహం తర్వాత ఏమిటి? మాటలు ఎర్రకోట దాటుతున్నాయి సరే, ప్రేరణ పిఠాపురం దాటుతోందా? ఆచరణ అమరావతి దాటుతోందా? ఇటీవల జరిగిన మూడు సంఘటనల గురించి చూస్తే పవన్ కళ్యాణ్ కబుర్లకు మాత్రమే పరిమితమా, ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ‘హక్కులు ఇతర మతాల వారికి ఉన్నట్లే హిందువులకు కూడా ఉంటాయి’ అని పదేపదే బలంగా ప్రస్తావిస్తున్న పవన్ కళ్యాణ్, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం లేదు. దానికి కారణం ఏంటి? ఆయనకున్న అధికారం సరిపోక చేయలేకపోతున్నారా, ఆయనను సైతం ప్రభావితం చేసి అడ్డుకుంటున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అక్రమ చర్చి నిర్మాణాలపై చర్యలకు ఆదేశాలు జారీ, ఉపసంహరణ:
2025 ఫిబ్రవరి 3 ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పెద్దిరెడ్డి ప్రసన్నకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. దాని ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ ఫిబ్రవరి 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ అనుమతులు ఉన్నవీ లేనివీ సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కావున సదరు దరఖాస్తును రాష్ట్రములోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశముపై విచారణ చేపట్టి, ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవలసినదిగా కోరడమైనది’’ అంటూ పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఆదేశించింది.
ఆ ఉత్తర్వుతో హిందువులకు తాత్కాలికంగా ఊరట కలిగింది. ఏ అనుమతులూ లేకుండా చిన్నచిన్న వీధుల్లో ఇళ్ళ మధ్య చర్చిలు పెట్టేసి, మైకులతో హోరెత్తించేస్తున్న క్రైస్తవ ప్రచారం నుంచి విముక్తి లభించే దిశగా ఒక అడుగైనా పడిందన్న ఆనందం కలిగింది. పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షక పవన్ కళ్యాణ్, హిందూధర్మం మీద క్రైస్తవ చర్చిల దాడిని అడ్డుకుంటున్నారంటూ ఆయన అభిమానులు కొంత ఉత్సాహపడ్డారు. కానీ ఆ ఆనందం ఒక్క నెలైనా నిలవలేదు.
2025 మార్చి 5న పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మరో ఉత్తర్వు వచ్చింది. ఫిబ్రవరిలో పెద్దిరెడ్డి ప్రసన్నకుమార్ దరఖాస్తు ఆధారంగా తమ శాఖ జారీ చేసిన మెమోను ఉపసంహరించడమైనది అంటూ ఏకవాక్య మెమో విడుదల చేసారు. అంటే చర్చిలకు అనుమతులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని తనిఖీ చేయనక్కరలేదు, దానిగురించి పట్టించుకోనక్కరలేదు అని అర్ధం. ఆ రెండు మెమోల మధ్య నెలరోజుల్లో ఒక్క చర్చినైనా తనిఖీ చేసిన దాఖలాలు లేవు. అంటే ఏం జరిగి ఉండవచ్చు? పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండా ఆయన మంత్రిత్వశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడతాయా? మొదట ఆదేశం, తర్వాత ఉపసంహరణ… రెండూ పవన్ కళ్యాణ్ ఆమోదం లేనిదే జారీ అయ్యాయని భావించాలా?
సాధారణంగా ముస్లిములు ప్రత్యక్ష దాడులతోనూ, క్రైస్తవులు పరోక్ష ప్రలోభాలతోనూ హిందువులను మతం మారుస్తారు. రెండు సందర్భాల్లోనూ హిందువులు భయంతో చేతులు ముడుచుకుని కూర్చుని ఉంటారు. చర్చి నిర్మాణాల క్రమబద్ధత గురించి తనిఖీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే అత్యంత అరుదైన సందర్భం. ఇంక దాన్ని ఆచరణలోకి రానీయకుండా తెరవెనుక శక్తులు చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేస్తాయి, చేసాయి కూడా. వారి ప్రయత్నాలు ఫలించాయని, రెండో మెమో ద్వారా స్పష్టంగా తెలిసింది. అయితే, అది పవన్ కళ్యాణ్ వైఫల్యం కాదా? పవన్ మాటల ప్రకారమే చూసినా, అక్రమ చర్చిల కథలను వెలికితీయడం క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించడం కాదు కదా. మరి అది ఎందుకు వెంటనే ఆగిపోయింది? ఒక్క చర్చి అక్రమమైనా బైటపడిందా?
(సశేషం)