తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశానికి సైతం విరోధిగా మారారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ అన్నారు. ఇన్నాళ్ళూ సనాతన ధర్మాన్నీ, హిందీ భాషను మాత్రమే వ్యతిరేకించిన స్టాలిన్ పద్ధతి మారిందంటూ మండిపడ్డారు. రూపాయి చిహ్నాన్ని మార్చివేసిన విషయంలో స్టాలిన్ వైఖరిని తప్పుపట్టారు. ఆ మేరకు ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేసారు.
‘‘హిందువులకు ద్రోహం చేస్తూ చేస్తూ, హిందీ పట్ల విరోధం ప్రకటిస్తూ ప్రకటిస్తూ ప్రజలు దేశ విరోధులుగా మారిపోతారు. చివరికి దేశంలో అందరికీ ప్రాతినిథ్యం వహించే మన జాతీయ ప్రతీకలను సైతం అవమానించే స్థాయికి దిగజారిపోతారు. దానికి నిలువెత్తు ఉదాహరణగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కనిపిస్తున్నారు.
రూపాయి శబ్దాన్ని తమిళంలో రాసినంత మాత్రాన ఎవరికీ సమస్య లేదు. మాకు మా దేశంలోని అన్ని భాషల గురించీ గర్వం ఉంది. కానీ రూపాయికి జాతీయ చిహ్నంగా ఉన్న ‘₹’ను ఆయన తమ బడ్జెట్ ప్రతుల్లో నుంచి తొలగించేసారు కదా, ఆ చిహ్నాన్ని తమిళనాడుకే చెందిన, అది కూడా ఆయన పార్టీ అయిన డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్ ధర్మలింగం కుమారుడు ఉదయ్‌కుమార్ అనే యువకుడే డిజైన్ చేసాడన్న సంగతిని స్టాలిన్‌కు ఎవరైనా తెలియజెప్పండి. నిజానికి ఆ విషయం గురించి ఆయన గర్వపడాలి. తమ రాష్ట్రానికే చెందిన ఆ యువకుడి ప్రతిభకు సన్మానం చేయాలి.
హిందీ పట్ల ద్వేషంతో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి దేశంలో రూపాయి ముద్రకున్న చిహ్నాన్ని తమ రాష్ట్రంలో మార్చేసారు, కానీ ఆయన ప్రతీ రూపాయి నోటు మీదా ముద్రించి ఉన్న ఆ చిహ్నాన్ని లేక హిందీ పదాలను కూడా మార్చివేయగలరా? లేదంటే ఆయన భారతీయ రూపాయిలు లేకుండా బతకగలరా? ఆ రూపాయిలే లేకుండా తమ పార్టీ ప్రభుత్వాన్ని నడపగలరా? రూపాయి చిహ్నాన్ని తొలగించడం ద్వారా ఆయన తమ రాష్ట్రానికే చెందిన యువకుడి ప్రతిభను ఆయన అవమానించడం లేదా? స్టాలిన్ తండ్రి కరుణానిధి కూడా ఆ రూపాయి చిహ్నాన్ని ఆమోదించారు, అంటే స్టాలిన్ తన తండ్రిని అవమానించినట్లే. ఒకవైపు సనాతనాన్ని దెబ్బ తీయాలంటూ పగటికలలు కనే కొడుకు ఉదయనిధి, మరోవైపు చక్కటి సృజన, ప్రతిభ కలిగిన ధర్మలింగం కుమారుడు ఉదయ్‌కుమార్. తండ్రి ఎలా ఉంటే కొడుకులూ అలాగే ఉంటారు, వారి ఆలోచనలూ అలాగే ఉంటాయని ఒక నానుడి. ఆ నానుడి నిజమేనని ఉదయ్ కుమార్, ఉదయనిధి నిరూపించారు.
సనాతన ధర్మాన్నీ, హిందీనీ ద్వేషించే స్టాలిన్, దేశ విరోధిగా మారడానికి ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది. విజ్ఞులైన తమిళనాడు ప్రజలకు అన్ని విషయాలూ తెలుసు. వారు డిఎంకె లేక ఇండీ కూటమి పన్నుతున్న పన్నాగాల్లో చిక్కుకోరు’’
ఇలా విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్, స్టాలిన్ వాదనను పూర్వపక్షం చేసారు. తమిళ ప్రజల విజ్ఞతపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు.