తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ కమిషన్ మరోసారి పర్యటన చేపట్టింది. న్యాయ విచారణ కమిషన్‌గా జస్టిస్ సత్యనారాయణమూర్తి రింగురోడ్డులోని సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు.అనంతరం వైకుఠం క్యూ కాంప్లెక్సు 2లో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 16 కంపార్టుమెంట్ల నుంచి భక్తులను దర్శనానికి పంపించే విధానాలను టీటీడీ అధికారులు జస్టిస్ సత్యనారాయణమూర్తికి వివరించారు.
వీఐపీ బ్రేక్‌లో స్వామి వారిని దర్శించుకున్న తరవాత ఆస్థాన మండపం సమీపంలోని సీసీ కెమెరా వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకుంటారు. ఉన్నతాధికారులు, తొక్కిసలాట బాధితులతో జస్టిస్ సత్యనారాయణమూర్తి సమావేశం అయ్యే అవకాశముంది.
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు, అప్పటి ఎస్పీ సుబ్బరాయుడు, సస్పెండైన డీఎస్పీ, గోశాల డైరెక్టర్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. విచారణ కమిషన్ వెంట డిప్యూటీ కలెక్టర్ సుధారాణి ఏవీఎస్వో విశ్వనాథ్, లైజనింగ్ అధికారి రూప్ చంద్ ఉన్నారు.
జనవరిలో వైకుంఠ దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోయారనే విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఘటనా ప్రాంతాలను పరిశీలించిన విచారణ కమిషన్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.
దీనిపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
తిరుపతి తొక్కిసలాట ఘటకు బాధ్యులుగా గుర్తించిన ముగ్గురు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం అందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. తిరుమల భక్తులకు సౌకర్యాలు మెరుగు పరచడంతోపాటు, త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది.
తిరుపతి తొక్కిసలాట ఘటనను సీఎం చంద్రబాబునాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. అధికారులు, ఛైర్మన్ మధ్య సమన్వయ లోపాలను గుర్తించి వారిని హెచ్చరించారు.