తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలుగువారి కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తుదిశ్వాస విడిచిన పొట్టి శ్రీరాములు స్మృతిలో 58 అడుగుల ఎత్తు విగ్రహాన్ని పెట్టిస్తామని ప్రకటించారు. విగ్రహంతో పాటు స్మారకవనం కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములు పేరిట ఆధునిక వసతులతో ఉన్నత పాఠశాల నిర్మిస్తామని చెప్పారు.
ప్రతీ ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పనిచేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ రోజునుంచీ వచ్చే యేడాది మార్చి 16 వరకూ అంటే యేడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ, డూండీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.