శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టర్ కార్యాలయంలోనూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. వీలైనంతవరకూ ప్లాస్టిక్‌ను మానేయాలంటూ ఉద్యోగులకు హితవు పలికారు. ఆ సందర్భంగా గుడ్డ సంచులు, స్టీల్ వాటర్ బాటిళ్ళు పంచిపెట్టారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేకించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా మానేయాలని పిలుపునిచ్చారు. మంచినీళ్ళ కోసం స్టీల్ లేదా మట్టి బాటిల్స్ ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల బదులు గుడ్డతో చేసిన చేతిసంచీలు వాడాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బందితో ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేయించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ నెలలో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడతామని కలెక్టర్ చెప్పారు. ఒక్క మచిలీపట్నంలోనే రోజుకు 80 టన్నుల చెత్త వస్తుంటే అందులో 36శాతం ప్లాస్టిక్ వస్తువులే ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వోద్యోగులు, అధికారుల్లో మార్పు వస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందన్నారు. ప్రభుత్వోద్యోగులు ఇకపై సమావేశాలకు ఎవరి మంచినీళ్ళ సీసా వారే తెచ్చుకోవాలని ఆదేశించారు. తద్వారా ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ బాటిళ్ళ వినియోగాన్ని నియంత్రించిన వారమవుతామని కలెక్టర్ వివరించారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ హాల్ నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ దగ్గర మహాత్మాగాంధీ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ‘ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తాం, భావితరాలను కాపాడతాం’ అంటూ నినాదాలు చేసారు. మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసారు.
అంతకుముందు కలెక్టర్ బాలాజీ చల్లపల్లి, ఉయ్యూరు మండలాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్ళి తడిచెత్త, పొడిచెత్త విడదీయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల దగ్గరకు వెళ్ళి గుడ్డ సంచులు పంచిపెట్టారు. ప్లాస్టిక్ కవర్లు, అందునా సింగిల్ యూజ్ కవర్ల వాడకం పూర్తిగా మానివేయాలని పిలుపునిచ్చారు. వస్తువులను గుడ్డ సంచులు, పేపర్ పొట్లాలలో విక్రయించాలంటూ ప్రోత్సహించారు.