పర్యావరణహిత ఏఐ ఆధారిత ఈవీ కార్ల తయారీ దిగ్గజం టెస్లాను ఏపీకి తీసుకువచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టెస్లా భారత్‌లో కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పాలని గత ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో టెస్లా అధినేత మస్క్‌తో చర్చలు జరిపారు. టెస్లా కార్ల దిగుమతులపై సుంకాలు తగ్గించాలని మస్క్, ప్రధాని మోదీని అభ్యర్థించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దేశంలోనే కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రధాని కోరినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. అందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం.దీంతో టెస్లా కార్ల తయారీ పరిశ్రమను దక్కించుకునేందుకు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోటీలో నిలిచాయి.
ఏపీ ప్రభుత్వం టెస్లా పరిశ్రమను ఎలాగైనా తీసుకురావాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల ఐటీ మంత్రి లోకేశ్ అమెరికా పర్యటనలో టెస్లా కీలక అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో కార్ల తయారీ ప్లాంట్ పెట్టాలని కోరారు. అందుకు వారు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా టెస్లాతో సంప్రదింపులు జరిపేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కీలక అధికారిని పురమాయించినట్లు వార్తలు వస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇస్తున్న రాయితీలను పరిశీలించి, అందుకు పోటీగా రాయితీలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది.
ఏపీ బలాలు
ఏపీలో టెస్లా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను సంస్థ ప్రతినిధులకు ఇప్పటికే వివరించారు. ఇక భూములు, రాయితీల విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. 974 కి.మీ సుముద్ర తీరం, 4 ప్రధాన ఓడరేవులతోపాటు జాతీయ రహదారికి సమీపంలో 500 ఎకరాలు సిద్దం చేశారు. మద్రాసు నగరానికి కేవలం 120.కి.మీ, కృష్ణపట్నం ఓడరేవుకు కేవలం 50 కి.మీ దూరంలో అనువైన ప్రాంతాలను ఏపీ ప్రభుత్వం సిద్దం చేసింది.
ఏపీఐఐసి ఛైర్మన్ ఎం.రామరాజు ఇటీవల మేనకూరు పారిశ్రామికవాడలోని 500 ఎకరాల స్థలాలను పరిశీలించి వచ్చారు. నాయుడుపేట సమీపంలోని మేనకూరు పారిశ్రామికవాడతోపాటు, తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీసిటీలోనూ భూములు పరిశీలించారు. కృష్ణపట్నం సమీపంలో ఇప్పడే అభివృద్ధి చేస్తోన్న క్రిస్ సిటీలోనూ భూములు సిద్దం చేశారు.
టెస్లా ఈవీ కార్ల తయారీ పరిశ్రమ వస్తే 20 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు, 300 ఉప పరిశ్రమలు ఏర్పాటు ద్వారా 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఏటా 20 లక్షల కార్ల తయారీ ద్వారా ప్రభుత్వానికి రూ.2500 కోట్ల రూపాయల పన్నుల ఆదాయం రానుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న టెస్లా కార్ల తయారీ పరిశ్రమను దక్కించుకునేందుకు ముఖ్యంగా ఐదు రాష్ట్రాలు పోటీలో నిలిచాయి. రాబోయే కొద్ది రోజుల్లో టెస్లా టీం భారత్‌లో పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏమిటీ టెస్లా గొప్పతనం?
టెస్లా కార్ల పరిశ్రమను 2003లో అమెరికాలో టెక్సాస్‌లో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పరిశ్రమ 30 కోట్ల కార్లను తయారు చేసింది. మార్కెట్లో ఉన్న పేరు పొందిన కంపెనీలను తలదన్ని టెస్లా తన సత్తాను చాటుకుంది. ఇటీవల కాలంలో ఏఐ ఆధారిత ఈవీలను అభివృద్ధి చేసింది. అమెరికా, ఐరాపా దేశాల్లో టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే భారత్‌లో టెస్లా అడుగుపెడితే భారత కార్ల తయారీ సంస్థలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉందనే ఆందోళన నెలకొంది.
టెస్లా కంపెనీ అమెరికాలోనే అతిపెద్ద ఆరో పరిశ్రమగా నిలిచింది. 2024లో ఈ కంపెనీ క్యాపిటలైజేషన్ 85 లక్షల కోట్లుగా ఉంది. ప్రపంచంలోనే 69వ అతిపెద్ద పరిశ్రమగా టెస్లా నిలిచింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కేవలం కార్ల తయారీకే పరిమితం కాలేదు. స్పేస్ ఎక్స్ పరిశోధనలు, స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు, సౌర విద్యుత్ ఫలకాల తయారీలాంటి విభిన్న రంగాలకు విస్తరించారు. ఏటా టెస్లా 50 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. టెస్లా కంపెనీ ఆదాయం ఏటా 120 లక్షల కోట్లకుపైగానే ఉంది. ఇది 54 దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. చైనా ఈవీ మార్కెట్‌ను శాసించే స్థాయికి ఎదిగిన టెస్లా, భారత్‌లో అడుగు పెట్టేందుకు దాదాపు మార్గం సుగమమైందని చెప్పవచ్చు.
ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు అందించి టెస్లా కార్ల తయారీ పరిశ్రమను తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. గుజారాత్, మహారాష్ట్ర నుంచి పోటీని తట్టుకుని టెస్లాను (#teslacar) ఏపీ వైపు అడుగులు వేయించడంలో చంద్రబాబునాయుడు విజయం సాధిస్తారా? లేదా అనేది మాత్రం త్వరలో తేలనుంది.