కేంద్ర హోంశాఖ కార్యదర్శి, UIDAI సీఈవోతో భేటీ కానున్న సీఈసీ
భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటరు ఐడీల జారీలో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ సెక్రటరీతో పాటు యూఐడీఏఐ సీఈవోతో జ్ఞానేశ్ కుమార్ భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత ఓటరు ఐడీ కార్డు, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలనే అంశంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎలక్టోరల్ డేటాలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా ఓటరు-ఆధార్ కార్డు సీడింగ్ గురించి చర్చించనున్నారు. ప్రస్తుతం స్వచ్ఛందంగా ఓటర్లు ముందుకు వస్తే ఈ ప్రక్రియ లో సీడింగ్ చేస్తున్నారు.
దిల్లీ శాసనసభ ఓటరు రోల్స్‌లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారని శివసేన, కాంగ్రెస్ ఆరోపించాయి.