జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మరొక్కసారి దేశం దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు, మిత్రులపై ప్రశంసలూ మామూలుగా ఉండేవే. అయితే దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడిన మాటలు యావద్దేశం దృష్టినీ ఆకర్షించాయి. దేశంలో మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీల నిజస్వరూపాన్ని పవన్ కళ్యాణ్ ఏకేసాడు. ఆత్మాభిమానం పేరిట దేశ వ్యతిరేకతను, వేర్పాటువాదాన్నీ ప్రోత్సహిస్తున్న పార్టీలను ఎండగట్టేసాడు.
త్వరలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే నాయకులు చెలరేగిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉత్తరాది పీడకులు, దక్షిణాది పీడితులపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ బొంకుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణతో దక్షిణాదికి తీరని అన్యాయం చేసేస్తున్నారంటూ కల్లబొల్లి యేడుపులు యేడుస్తున్నారు. అలాంటి సోకాల్డ్ ద్రవిడవాదులు అందరికీ ఘాటుగా ఇచ్చిపడేసాడు పవన్ కళ్యాణ్.
లౌకికవాదం అంటే హిందువులపై మతపరమైన ఆంక్షలు విధించి, మిగతా మతాలను నెత్తిన ఎక్కించుకోవడం కాదు, తాను లెఫ్టిస్టునోహబల, రైటిస్టో లేక సెంటరిస్టునో కాదని స్పష్టం చేసాడు. అన్ని వాదాలనూ సకమానంగా ఆదరించే మానవతావాదినని చెప్పుకున్నాడు. ఏడు సిద్ధాంతాలతో పార్టీని నిర్మించుకున్నామనీ, వాటిని తప్పనిసరిగా అమలు చేస్తామనీ చెప్పుకొచ్చారు. ఆ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో తమ ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్‌సిపి మీద, ఆ పార్టీ అధినేత జగన్ మీదా ప్రచ్ఛన్నంగా చురకలు వేసారు.
అణువణువులోనూ హిందుత్వం:
పవన్ కళ్యాణ్ తన రక్తంలోనే హిందుత్వం ఉందని ప్రకటించారు. హిందుత్వం, సనాతన ధర్మం ఓట్ల కోసం మాత్రమే కాదన్నారు. అందుకే రాష్ట్రంలో జగన్ పాలన సమయంలో ఆలయాల మీద దాడులు జరిగినపుడు సంయమనం పాటించానన్నారు. రాముడు విగ్రహం తల నరికితే కోపం రాకూడదని చెప్పడానికి మీరెవరు? హైదరాబాద్ లో ఓ నాయకుడు తమకు 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ అంతం చేస్తామని చెబితే తాము నోరెత్తి మాట్లాడకూడదా? బతుకమ్మను హేళన చేస్తే మౌనంగా ఉండమంటారా? మేం పూజించే లక్ష్మిని, పార్వతినీ తిట్టినా ఏమీ అనకూడదంటే ఎలా? ఆ తరం వెళ్లిపోయింది. ఇప్పుడు మేం తప్పును తప్పు అనే చెబుతాం. అల్లాకు, జీసస్‌కు ఓ న్యాయం, అమ్మేవారికి ఓ న్యాయం అంటే కుదరదు… అంటూ పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.
కుహనా లౌకికవాదానికి రోజులు చెల్లాయి:
సనాతన ధర్మం అంటే మంచి ధర్మమని వివరించారు పవన్ కళ్యాణ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు, భారత్‌లో మాత్రం ముస్లింలను, క్రైస్తవులనూ గౌరవించడం సనాతన ధర్మపు గొప్పదనమే అన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సూడో సెక్యూలరిజం మీద విరుచుకుపడ్డారు. సెక్యులరిజం అంటే ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించడం కావాలి. గోద్రాలో అల్లర్లనూ ఖండించాలి, కరసేవకుల రైలును తగులబెట్టినపుడూ అలాగే స్పందించాలి. ఓట్ల కోసం సూడో సెక్యులరిస్టులుగా మాట్లాడటం మంచిది కాదు. ఏ మతం వారు తప్పు చేసినా వారిని కచ్చితంగా శిక్షించాల్సిందే… అన్నారు.
హిందీ భాష వద్దు, హిందీలోకి సినిమా డబ్బింగులా?:
త్రిభాషా సూత్రం మీద తమిళనాడు రాజకీయ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారు. దేశంలో అన్ని భాషలనూ గౌరవించాలన్నారు. హిందీ తమకు వద్దు అనే తమిళ నాయకులు వారి తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయడం మానుకోవాలన్నారు. ఉత్తరాది నుంచి పనివాళ్లను తెచ్చుకోవడం మానేయాలంటూ ఘాటుగా స్పందించారు. హిందీ రాష్ట్రాల నుంచి డబ్బులు కావాలి, వారి భాష మాత్రం వద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. సంస్కృతంలో మంత్రాలు చదవకూడదంటారు. ఇస్లాం ప్రార్థనలు అరబిక్‌లో ఉంటాయి. హిందువుల మనోభావాలు మాత్రమే దెబ్బతీస్తారెందుకు? అని నిలదీసారు.
రూపాయి, డీలిమిటేషన్ మాటున వేర్పాటువాదం:
రూపాయి చిహ్నాన్ని రాష్ట్రానికో పద్ధతిలో పెడితే దేశానికి మంచిది కాదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మాట మాట్లాడితే దేశం నుంచి విడిపోతామంటే దేశం ఏమైనా కేకు ముక్కా అని ప్రశ్నించారు. ఉత్తరాదికీ, దక్షిణాదికీ తేడా లేదన్నారు. భాష, భావం వేరు అంటూ దేశాన్ని విడగొట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. రాజకీయ వైరుధ్యాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయకూడదంటూ స్పష్టం చేసారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలోనూ డీఎంకే నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అసలు ప్రకటన రాకముందే రాజకీయాల కోసం విషయాన్ని పెద్దగా చేయడం, లబ్ధి పొందాలని చూడటం సరికాదన్నారు.
తనను తాను ‘సనాతన ధర్మ పరిరక్షకుడి’గా చూపించుకుంటున్న పవన్ కళ్యాణ్, పార్టీ ఆవిర్భావ సభలో సైతం ఆ విషయంలో విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సనాతన ధర్మం పేరు ఎత్తితే చాలు, వ్యంగ్యంగా అపహాస్యం చేసేవారికి తర్కబద్ధంగా బుద్ధి చెప్పారు. లౌకికవాదం పేరుతో క్రైస్తవ, ఇస్లాం మతాలను బుజ్జగించడం సరి కాదని కుండ బద్దలు కొట్టారు. ఇతర మతాలకు గౌరవం ఇచ్చినట్లుగానే హిందూ మతానికి కూడా గౌరవం ఇవ్వాల్సిందేనని మరోసారి చెప్పుకొచ్చారు. మత ఆచరణలో లోపాలేమైనా తలెత్తితే వాటిని సరిదిద్దుకుంటామనీ, అంతే తప్ప వాటిని చూపించి హిందువులను పరిహాసం చేయడం తగదనీ పవన్ స్పష్టం చేసారు. రాజకీయ అవసరాల కోసం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించకూడదన్నారు. ద్రవిడవాదం పేరిట దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు.