పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి తిరుగుబాటుదారులను అంతమొందించామని పాక్ సైన్యాధికారులు చెబుతుంటే ఇందుకు విరుద్దంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. రైలు హైజాక్ ఘటనలో ఆపరేషన్ చేపట్టిన 214 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామని బలూచ్ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి, పాక్ జైళ్లలోని తిరుగుబాటుదారులను విడుదల చేసేందుకు 48 గంటలు సమయం ఇచ్చామని, అది వారు సద్వినియోగం చేసుకోలేదని బలూచ్ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అందుకే పాక్ సైనికులను చంపినట్లు చెబుతున్నారు. చివరి బులెట్ వరకు తిరుగుబాటుదారులు పోరాటం చేశారని, చనిపోయిన వారికి నివాళులు అర్పించారు.
బలూచ్ తిరుగుబాటుదారుల రైలు హైజాక్ ఘటనలో 26 మంది చనిపోయారని, అందులో 18 మంది పాక్ సైనికులు కాగా మిగిలినవారు తిరుగుబాటుదారులని సైన్యం ప్రకటించింది. బలూచ్ తిరుగుబాటుదారులను మట్టుబెట్టినట్లు సైన్యాధికారులు ఓ వైపు చెబుతుంటే, పాక్ సైనికులను చంపేశామని బలూచ్ తిరుగుబాటుదారులు చెప్పడంతో అసలు ఏం జరిగింది అనే దానిపై ఆసక్తి నెలకొంది.